వికటించిన చైనా వ్యాక్సిన్‌

Spread the love

*వికటించిన చైనా వ్యాక్సిన్‌!*

*తీవ్ర విపరిణామాలతో ప్రయోగాలకు బ్రేక్‌

* రియోడిజనిరో: అంతర్జాతీయ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రేసులో ముందున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్‌ ‘కరోనావాక్‌’ ప్రయోగాలకు ఆటంకం కలిగింది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ ప్రయోగాలు తీవ్ర విపరిణామాలకు దారితీయటంతో  నియమాలను అనుసరించి వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. *ఏం జరిగింది?* కరోనావాక్‌ వ్యాక్సిన్‌ ప్రయోగించిన కొందరిలో మరణాలు సంభవించగా.. ఇతర దుష్ప్రభావాలు మరణానికి దారితీసేవి, దీర్ఘకాలం ప్రభావం కలిగినవి, తీవ్ర అనారోగ్యానికి దారితీసేవిగా ఉన్నాయని తెలియవచ్చింది. ఈ సంఘటన అక్టోబర్‌ 29న చోటుచేసుకున్నట్టు తెలిసింది. కాగా, ప్రయోగాలను నిర్వహిస్తున్న సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ నుంచి ఈ విషయంపై ఏ వివరణ వెలువడలేదు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తదితర ప్రయోగాలు కూడా  ఆగి మరల ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో జరిగే ఔషధ ప్రయోగాల్లో ఈ విధమైన ఆటంకాలు సాధారణమేనని సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. అయితే లక్షల మంది చైనా ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ఇప్పటికే ప్రారంభం కావటంతో పరిస్థితి ప్రశ్నార్థకమౌతోంది.

*ఇదే తొలిసారి* చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రయోగాల్లో ఈ విధంగా జరగటం ఇదే తొలిసారి. టీకా తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రం బుటాంటన్‌ ఇన్‌స్టిట్యూట్‌ గత నెలలో ప్రకటించింది. 60,000 మంది వాలంటీర్లపై జరిపిన ఆఖరి దశ ప్రయోగాల్లో గణనీయమైన దుష్పరిణామాలు గోచరం కాలేదని చైనా వెల్లడించింది. దీనితో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల చివరి దశకు చేరుకున్న తొలి  సంస్థగా చైనాకు చెందిన సినోవాక్‌ నిలిచింది.

*హడావిడి ప్రయత్నాలు..* ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఐదు కోట్ల మందికి పైగా సోకిన కొవిడ్‌ మహమ్మారి కట్టడికి.. వీలయినంత త్వరగా వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా సంవత్సరాలు పట్టే వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియమాలను సడలించి మరీ కాల వ్యవధిని కుదించారు. ఇందుకు ప్రభుత్వాలు చేయూత అందస్తు్నాయ. అయితే కొవిడ్‌కు విరుగుడు కనుగొనే హడావిడి ప్రయత్నాల కారణంగా ఫలితాలు వికటించనున్నాయా అనే కోణంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు ఫైజర్‌, బయో ఎన్‌ టెక్‌ ఫార్మా సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న టీకా, 90 శాతం మేర సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు సంబంధిత సంస్థలు ప్రకటించటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *