*ఐపీఎల్ ఆదాయం రూ.4 వేల కోట్లు* ముంబయి: విపత్కర పరిస్థితుల్లో యూఏఈలో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించిన బీసీసీఐ ఆ టోర్నీ ద్వారా రూ.4000 కోట్లు ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ ఈ విషయం వెల్లడించాడు. నిరుటి కంటే ఐపీఎల్ వీక్షణ 25 శాతం పెరిగిందని, టోర్నీ సందర్భంగా 1800 మందికి 30 వేల ఆర్టీ-పీసీర్ పరీక్షలు నిర్వహించామని అతను తెలిపాడు. అయితే ఆదాయం లెక్కలను ధూమల్ విడమరిచి చెప్పలేదు. ప్రసార హక్కులే బీసీసీఐకి పెద్ద ఆదాయ మార్గం. బీసీసీఐ 2017లో అయిదేళ్ల కాలానికి రూ.16,347 కోట్లకు స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈసారి ఖర్చులు బాగా తగ్గించుకున్నామని ధూమల్ తెలిపాడు.
‘‘కిందటి ఐపీఎల్‌తో పోలిస్తే బోర్డు 35 శాతం ఖర్చు తగ్గించుకోగలిగింది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించి రూ.4000 కోట్లు ఆర్జించాం. వీక్షణ కూడా 25 శాతం పెరిగింది. ముంబయి-చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికులు వీక్షించిన మ్యాచ్. ముందు ఐపీఎల్ సవ్యంగా జరుగుతుందా అని సందేహించిన వారు.. టోర్నీని నిర్వహించినందుకు మాకు కృతజ్ఞతలు చెప్పారు. ఐపీఎల్ జరగకపోతే క్రికెటర్లు ఓ ఏడాదిని కోల్పోయేవాళ్లు’’ అని చెప్పాడు. చాలా ఫ్రాంఛైజీల బృందంలో 40 మందికి పైగా ఉంటే.. ముంబయి మాత్రం 150 మందితో యూఏఈ వచ్చిందని ధూమల్ తెలిపాడు.
టోర్నీ సందర్భంగా ఒకవేళ కరోనా కేసులు నమోదైతే.. పేషెంట్లను క్వారంటైన్లో ఉంచడం కోసం విడిగా 200 గదులను సిద్ధంగా ఉంచామని చెప్పాడు.
*జకోవిచ్ వల్ల..:* ఎగ్జిబిషన్ టోర్నీలో టెన్నిస్ స్టార్ జకోవిచ్ కరోనా బారిన పడడంతో ఐపీఎల్ నిర్వహణపై అప్పట్లో సందిగ్ధంలో పడ్డామని ధూమల్ చెప్పాడు. ‘‘జకోవిచ్‌కు పాజిటివ్ రావడం మమ్మల్ని సందిగ్ధంలో పడేసింది. ఐపీఎల్ వద్దని చాలామంది అన్నారు. క్రికెటర్లకు ఏదైనా అయితే పరిస్థితేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ టోర్నీ తప్పక నిర్వహించాలని బోర్డు కార్యదర్శి జై అన్నాడు’’ అని చెప్పాడు.