జులై 8 నుంచి పింఛను రూ.2,500*

Spread the love

*జులై 8 నుంచి పింఛను రూ.2,500* *వచ్చే మూడేళ్లూ వైఎస్‌ పుట్టినరోజునే పింఛను పెంచుతాం*

*పత్రికలు, టీవీలపై ధ్వజమెత్తిన సీఎం జగన్‌*

ఆంద్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజైన జులై 8 నుంచి.. పింఛను మొత్తాన్ని రూ.2,500 చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ‘2022 జులై 8 నాటికి రూ.2,750కి పెంచుతాం..

2023 జులై 8 నాటికి రూ.3వేలు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎక్కడా మాట తప్పబోమని, చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. శాసనసభలో శుక్రవారం ఉదయం మాట్లాడిన సీఎం.. ప్రతిపక్షనేత చంద్రబాబుపై విమర్శలు సంధించారు.

ఆయనకు సహకరిస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5పై విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబుకు కుళ్లు, కుట్ర రాజకీయాలు ఎక్కువ. పోడియం పైకి ఎమ్మెల్యేలను పంపి సభాపతిపై పడినంత పనిచేయించి.. ఒక పద్ధతి ప్రకారం సస్పెండై సభను వదిలిపోయారు’ అని ధ్వజమెత్తారు. ‘పింఛను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతూ ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల పది నెలలు పట్టించుకోలేదు. ఇది ఆ పత్రికలకు, ఛానళ్లకు కనిపించదా?’ అని జగన్‌ ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెలకు 45.98 లక్షల మందికి రూ.556 కోట్లను పింఛన్లుగా ఇస్తే.. ఇప్పుడు తమ ప్రభుత్వం 59.54 లక్షల మందికి రూ.1,500 కోట్లు అందిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా 2019 జనవరి 25న పింఛను మొత్తాన్ని పెంచుతున్నట్లు ఇచ్చిన జీవోతో పాటు.. 2018 అక్టోబరు నుంచి ఏ నెలలో ఎన్ని పింఛన్లు, ఎంత మొత్తం ఇచ్చారు..

వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎన్ని పింఛన్లకు ఎంత మొత్తం ఇచ్చిందనే వివరాలతో కూడిన పత్రాలను శాసనసభలోని డిజిటల్‌ తెరలపై ప్రదర్శించి చూపారు.

*3 వేల వరకు పెంచుకుంటూ పోతాం* ‘ఎన్నికల సమయంలో ప్రతి సమావేశంలోనూ పింఛను సొమ్మును రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పాం. వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పాం. ఏదైతే చెప్పామో.. అదే అమలు చేశాం’ అని జగన్‌ వివరించారు. *చేయూతపై అసెంబ్లీలో ప్రదర్శించినా.. ఎలా రాస్తారు?*

‘చేయూతపై ఎన్నికల్లో ఏం చెప్పాం.. ప్రణాళికలో ఏం ఇచ్చాం.. అనే వివరాల్ని శాసనసభలో ప్రదర్శించి, సాక్ష్యాధారాలతో సహా చూపినా.. ‘పింఛన్లు, చేయూతపై సీఎం చెప్పినవి అబద్ధాలు’ అని ఏ రకంగా రాయగలుగుతారు?’ అని జగన్‌ ప్రశ్నించారు. చేయూత పథకం అమలుకు సంబంధించి ఎన్నికల ప్రచారం సమయంలో ప్రసంగించిన వీడియోతో పాటు ఎన్నికల ప్రణాళికలోని అంశాలను క్లిప్పింగ్‌ ద్వారా సభలో ప్రదర్శించారు. ‘మేము స్వచ్ఛతతో, న్యాయమైన పాలన అందిస్తుంటే.. ఇలా రాయడం న్యాయమేనా?’ అని ప్రశ్నించారు. *సుస్థిర ఆదాయం వచ్చేలా చేస్తున్నాం* ‘చేయూత పథకం ద్వారా 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,604 కోట్లను జమ చేయడమే కాకుండా.. వారి చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. రిలయన్స్‌, ఐటీసీ, పీఅండ్‌జీ, అల్లానా, హిందూస్థాన్‌ యూనీలీవర్‌, అమూల్‌ తదితర పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. సుస్థిర ఆదాయం వచ్చేలా చేస్తున్నాం’ అని జగన్‌ తెలిపారు. ‘77 వేల చిల్లర దుకాణాలు, 4.69 లక్షల ఆవులు/గేదెల యూనిట్లు, 2.49 లక్షల గొర్రెలు/మేకల యూనిట్లు అందిస్తున్నాం. 6 లక్షల మందికి పైగా వితంతు మహిళలకు పింఛనుతో పాటు చేయూత పథకం ద్వారా సాయం అందిస్తున్నాం’ అని వివరించారు. *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *