రష్యా టీకాపై కోటి ఆశలు
స్ఫుత్నిక్ శ్రేణిలో మరో వ్యాక్సిన్
వాడకానికి క్యూ కట్టిన దేశాలు
మాస్కో: ఒకే ఒక్క డోస్‌తో కొవిడ్ ఆటకట్టుకు దారి తీసే రష్యా వ్యాక్సిన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
రష్యాలో రూపొందిన స్ఫుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఒక్కడోసుతోనే 80 శాతం సమర్థతతో పనిచేస్తుందని, పాత కొత్త కొవిడ్ స్ట్రెయిన్‌ను నివారిస్తుందని ప్రాధమిక పరీక్షలలో నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు రెండు డోస్‌లతోనే సరైన సమర్థతను కనబరుస్తున్నాయి. ఒన్ షాట్ స్ఫుత్నిక్ తేలికపాటి కరోనా వ్యాక్సిన్ వాడకానికి అధికారిక అనుమతిని ఇస్తున్నట్లు రష్యాకు చెందిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు గురువారం తెలిపారు.
అత్యధిక కరోనా సంక్రమణలు ఉన్న పలు దేశాలకు ఈ వ్యాక్సిన్ల సరఫరాకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని, ఇప్పటికైతే దేశంలో వాడకానికి అనుమతి వచ్చిందని రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి (ఆర్‌డిఐఎఫ్) ప్రకటన వెలువరించింది.
ఇప్పటికే 60 దేశాలలో దీని వాడకానికి అనుమతి దక్కింది. టీకా ధర డోస్‌కు 10 డాలర్ల కన్నా తక్కువగానే ఉంటుంది. రెండు డోస్‌ల స్ఫుత్నిక్ వి ఫలితం 91.6 శాతంగా నమోదైంది.ఇప్పుడు ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 80 శాతం వరకూ ఉంటుంది. రష్యాలో వ్యాక్సిన్ల కార్యక్రమంలో వాలంటీర్లపై 28 రోజుల పాటు ప్రయోగించిన తరువాత దీని సమర్థతను నిర్థారించుకున్నారు. ఇటీవల తలెత్తుతున్న కొత్త స్ట్రెయిన్ కొవిడ్‌ల పట్ల కూడా ఈ టీకా బాగా పనిచేస్తుందని తెలిపారు. మాస్కోకు చెందిన గమలెయా ఇనిస్టూట్‌లో ఈ సింగిల్ డోస్ టీకా తయారు అయింది. ఎగుమతులకు ఉద్ధేశించిన ఈ టీకాకు ఇప్పటివరకూ యురోపియన్ మెడిసిన్ ఏజెన్సీ నుంచి కానీ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) నుంచి కానీ అనుమతి దక్కలేదు.
ఇప్పటికే కొన్ని దేశాలు స్ఫుత్నిక్ టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సొవియట్ యూనియన్ దశ నాటి ఉపగ్రహం స్ఫుత్నిక్ పేరిట వచ్చిన ఈ టీకాలతో రష్యా దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యానికి వాడుకుంటుందని, కరోనా మందు బలహీనతల దశలో టీకాను పావుగా వాడుకుంటుందనే విమర్శలు వెలువడ్డాయి. అత్యవసరంగా వైరస్ నియంత్రణకు అవసరం అయినప్పుడు ఈ సరికొత్త వ్యాక్సిన్ వాడకం సత్ఫలితాలను ఇస్తుందని రష్యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. రష్యాలో గత నెలలో స్పుత్నిక్ శ్రేణి రెండు డోస్‌ల టీకాను వాడకంలోకి తీసుకువచ్చారు. ఇది దాదాపు వంద శాతం సమర్థతను చాటిందని రష్యా సైంటిస్టులు చెపుతున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.