లాక్‌డౌన్ సమయంలో భారత్‌కు సంజీవని

postoffice
Spread the love

ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశానిది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటానికి లాక్‌డౌన్‌లో ఉన్న దేశంలో ఇప్పుడు ప్రాణాలను రక్షించే మందులు,

పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరేరా కథనం.

ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలో అందరికీ పరిచయమున్న వాహనాలు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు అనునిత్యం వేలాది ప్రయాణాలు చేస్తుంటాయి.

ఈ తపాలా శాఖ.. లేఖలు, పార్సిళ్లు సరఫరా చేయటమే కాకుండా ఇంకా ఎన్నో సేవలు అందిస్తుంది. ఇదొక బ్యాంకు. ఒక పెన్షన్ నిధి. కోట్లాది మంది భారతీయులకు ప్రాథమిక పొదుపు సాధనం.

ఇప్పుడు.. రవాణా స్తంభించిపోయిన దేశంలో అత్యవసరమైన ప్రాంతాలకు వైద్య పరికరాలు, ఔషధాలను కూడా రవాణా చేస్తోంది పోస్టల్ సర్వీస్.

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా మార్చి 24 నుంచి భారతదేశంలో లాక్‌డౌన్ విధించినపుడు, నిత్యావసర సేవలు మినహా అన్ని వ్యాపారాలను మూసివేయాలని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు.

 

కరోనావైరస్

లాక్‌డౌన్ అమలులోకి రావటానికి కేవలం నాలుగు గంటల ముందు ఈ ప్రకటన చేయటంతో, చాలా పరిశ్రమల పరిస్థితి అయోమయంగా మారింది. అందులో, కోవిడ్-19 మీద పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఆస్పత్రులు, ఫార్మా సంస్థలు, లేబరేటరీలు కూడా ఉన్నాయి.

‘‘మేం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. మేం సాధారణంగా వినియోగదారులకు ఉత్పత్తులను పంపించటానికి కొరియర్ సర్వీసుల మీద ఆధారపడుతుంటాం. కానీ ఇప్పుడు అవేవీ స్పందించటం లేదు. బహుశా వారికి కర్ఫ్యూ పాస్‌లు కానీ, డెలివరీ చేసే సిబ్బంది కానీ లేరేమో’’ అని ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మదన్ బీబీసీతో చెప్పారు.

ఈ ఉత్పత్తుల్లో చాలా వరకూ గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి అవసరమైన అత్యవసర ఔషధాలు ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ పరిస్థితిలో ఆయనకు ఉత్తరప్రదేశ్‌లో పోస్టల్ సర్వీస్ సీనియర్ సూపరింటెండెంట్ అలోక్ ఓఝా నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

మందులు, వైద్య పరికరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ గమ్యస్థానాలకు చేరవేయటం కోసం పోస్టల్ సర్వీస్ అప్పటికే గుజరాత్‌లో ఐడీఎంఏతో చేతులు కలిపింది. అదే పని మరింత విస్తృత స్థాయిలో చేస్తామని ఓఝా ముందుకొచ్చారు.

‘‘మేం పరిష్కారం కోసం చూస్తున్నాం. పోస్టల్ సర్వీస్‌కి దేశవ్యాప్తంగా సంపూర్ణ వ్యవస్థ ఉంది’’ అని మదన్ పేర్కొన్నారు.

 

పోస్టల్ ఉద్యోగులు

లాక్‌డౌన్ సమయంలో ‘నిత్యావసర సేవలు’గా పరిగణించి, పనిచేయటానికి అనుమతించిన అతి తక్కువ పరిశ్రమల్లో పోస్టల్ సర్వీసు ఒకటి.

‘‘నేను పరిశ్రమల వారితో మాట్లాడినపుడు.. మార్కెట్‌లో ఔషధాలకు కొరత రాకుండా చూడటానికి, ఎవరూ అనవసరంగా నిల్వలు చేసుకోకుండా ఉండటానికి పోస్టల్ రవాణా తోడ్పడుతుందని చెప్పారు’’ అని ఓఝా బీబీసీకి తెలిపారు.

ఈ విషయం గురించి తెలుస్తుండటంతో పోస్టల్ సాయం కోసం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు.

తమకు అత్యవసరమైన కోవిడ్-19 టెస్టింగ్ కిట్లు 550 కిలోమీటర్ల దూరంలో దిల్లీలో చిక్కుకుపోయినపుడు.. తాను ఓఝాను సంప్రదించానని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఉజ్జల ఘోషల్ చెప్పారు.

‘‘టెస్టింగ్ కిట్లు పంపించటానికి కొరియర్ సర్వీసు పనిచేయట లేదని, వాటిని తీసుకోవటానికి ఎవరినైనా దిల్లీకి పంపించాల్సి ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాకు చెప్పింది. కానీ లాక్‌డౌన్ కారణంగా మేం ఎవరినీ పంపించే దారి లేదు’’ అని ఆమె బీబీసీకి వివరించారు.

ఆ కిట్లను పోస్టాఫీసుకు పంపించే వీలు లేకపోవటంతో.. తమ కోరిక మేరకు పోస్టల్ సర్వీస్ ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి స్వయంగా కిట్లు తీసుకుని మరుసటి రోజు కల్లా తమకు తెచ్చి ఇచ్చిందని ఆమె తెలిపారు.

 

పోస్టల్ వ్యాన్
చిత్రం శీర్షికభారతీయ పోస్టల్ వ్యాన్లు రోజుకు వేల సంఖ్యలో ట్రిప్పులు వేస్తాయి.

చాలా ఇతర సంస్థలు, కంపెనీలు కూడా ఇటువంటి విజ్ఞప్తులు చేశాయి. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ.. అత్యవసరమైన మందులు, కోవిడ్-19 టెస్ట్ కిట్లు, ఎన్95 మాస్కులు, వెంటిలేటర్ల నుంచి ప్రతి వాటినీ తాము గమ్యస్థానాలకు చేరుస్తున్నామని ఓఝా చెప్పారు. తమ ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్ల ద్వారానే ప్రధాన నగరాలు, రాష్ట్రాల మధ్య మందులు, పరికరాల రవాణా చేస్తున్నామన్నారు.

సుదీర్ఘ ప్రయాణాలకు, చాలా అత్యవసర ప్రయాణాలకు సరకు రవాణా విమానాలను ఉపయోగించారు. తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్‌కు డిఫిబ్రిలేటర్లను తరలించటం వంటివి ఇందులో ఉన్నాయి.

కొన్నిసార్లు కొన్ని పార్సిళ్లు రవాణా చేసేటపుడు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమవుతాయి. ఒక ఔషధ తయారీ సంస్థ తమ పంపించే మందులను పూర్తిగా శీతలీకరణలో ఉంచుతూ రవాణా చేయాలని కోరారు. అటువంటి విజ్ఞప్తులన్నిటినీ కూడా పోస్టల్ సర్వీస్ నెరవేరుస్తోంది.

‘‘భారతదేశంలో అన్నిప్రాంతాలకూ అత్యుత్తమ అనుసంధానం ఉన్న సేవలు మావి. మేం ప్రతి చోటా ఉన్నాం. ఈ విషయంలోనూ మేం సాయపడగలమని మాకు తెలుసు’’ అని ఓఝా చెప్పారు.

లాక్‌డౌన్‌ను పొడిగించటంతో.. రాబోయే వారాల్లో పోస్టల్ సర్వీస్ మరింత పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన భావిస్తున్నారు.

Source:BBC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *