మాంసాహారం తింటే కరోనావైరస్

Spread the love

మాంసాహారం తీసుకుంటే క‌రోనావైరస్ సోకుతుందంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారం కారణంగా కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మాంసం ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గింది.

ఈ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఎగుమతులతో పాటు అమ్మకాలపైనా తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాంసం అమ్మకాలపై అధికారులే ఆంక్షలు విధిస్తుండటం విశేషం.

ప్ర‌స్తుతం అమ్మ‌కాల ప‌రిస్థితి ఏంటి ?

నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎగ్ & పౌల్ట్రీ-2022 పేరిట కేంద్ర పశుసంవర్థశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015-16 నాటికి దేశ పౌల్ట్రీ మార్కెట్ విలువ సుమారు రూ.80 వేల కోట్లు. ఇందులో సుమారు 20 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ డైరక్టర్ ఎం.సాయి బుచ్చారావు బీబీసీతో చెప్పారు. కరోనావైరస్ పేరిట కొనసాగుతున్న ప్రచారం కారణంగా ప్రస్తుత ఆదాయంలో సుమారు 60 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.

కరోనావైరస్ ప్రచారానికి తోడు ఏపీలో కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఫలితంగా గడిచిన కొద్ది రోజుల్లో ఎగుమతులతో పాటు ప్రజల వినియోగంలో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. గతంతో పోల్చితే స్థానిక వినియోగం సుమారు 70శాతం వరకు పడిపోయిందని, 60 శాతం వరకు ఎగుమతులు నిలిచిపోయాయని, పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తున్నామని బుచ్చారవు బీబీసీకి వివరించారు.

కోళ్ల‌లో పెరుగుతున్న వ్యాధులతో మ‌రింత క‌ల‌క‌లం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉభయ గోదావ‌రి జిల్లాలతో పాటు విశాఖ‌, కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌రిధిలో అనేక కోళ్ల ఫారాల్లో ఒక్క‌సారిగా పెద్ద సంఖ్య‌లో కోళ్లు చ‌నిపోతున్నాయి. గ‌త రెండు వారాలుగా ఇది బాగా పెరిగింది. గతంలోనూ అప్పుడప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈసారి ప‌రిస్థితి తీవ్రంగా ఉంద‌ని అధికారులు కూడా అంగీక‌రిస్తున్నారు.

విరిలెంట్ న్యూకేజిల్ అనే వ్యాధి కారణంగానే ఒక్కసారిగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు. సాధారణంగా బ్రాయిలర్‌కి వ్యాక్సినేషన్ సమస్య కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్యలో కోళ్ల ఫారాలు ఖాళీ అవుతున్నాయి. నష్టం అంచనావేసే పనిలో అధికారులు ఉన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక రావచ్చని చెబుతున్నారు.

మాంసం అమ్మ‌కాల‌పై నిషేధం

వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో మాంసం అమ్మ‌కాల‌పై కొన్ని చోట్ల నిషేధం కూడా విధిస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు మున్సిపాలిటీలో వారం రోజుల పాటు చికెన్, మటన్ సహా అన్ని రకాల మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. జనంలో రోజు రోజుకీ అపోహలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తగా తాత్కాలికంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించామని తణుకు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ మల్లేశ్వరరావు బీబీసీతో అన్నారు.

ఇలా కొన్నిచోట్ల అధికారికంగానే నిషేధం విధించగా.. మరి కొన్నిచోట్ల అనధికారిక నిషేధం కొనసాగుతోంది. దీంతో చికెన్ ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. జనవరి నెలాఖరునాటికి కిలో రూ.200గా ఉన్న బ్రాయిలర్ చికెన్ ఇప్పుడు రిటైల్ మార్కెట్లో రూ.150 కన్నా దిగువకు పడిపోయింది. వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయి.

5 కేజీల మటన్ కొంటే హెల్మెట్ ఉచితం

అటు మాంసం అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోవడంతో వ్యాపారులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా నందిగామలో ఓ మటన్ దుకాణం యజమాని 5 కేజీల మాంసం కొంటే హెల్మెట్ ఉచితం అంటూ కొనుగోలుదారుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

5 కేజీల మటన్ కొంటే హెల్మెట్ ఉచితం

నిలిచిన ఎగుమతులు – లబోదిబోమంటున్న పౌల్ట్రీ యజమానులు

మొదట కరోనావైరస్ వదంతులు, ఆపై యజమానులు పెంపకంలో జాగ్రత్తలు పాటించని కారణంగా కోళ్లకు సోకిన వ్యాధులు… ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన పౌల్ట్రీ వ్యాపారి ఈడ్పుగంటి సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.

వ్యాక్సినేషన్ లోపం కారణంగా కోళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి వేల సంఖ్యలో చనిపోతున్నాయి. అలా చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చేయాలి లేదా కాల్చేయాలి. కానీ కొందరు రోడ్డుపక్కనే పడేయడంతో జనంలో మరింత భయాలు మొదలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎగుమతులు ఆగిపోయాయని ఫలితంగా నిర్వహణ భారం పెరుగుతోందని సత్యన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

చికెన్ తింటే కరోనావైరస్ వస్తుందన్న వదంతుల ప్రభావం దేశ వ్యాప్తంగా పౌల్ట్రీ మార్కెట్‌పై కూడా పడిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల గడిచిన మూడు వారాలుగా సుమారు 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది.

ఒక్కసారిగా అమ్మకాలు పడిపోవడంతో చిన్న వ్యాపారులు నష్టపోయారు. తాజా పరిణామాలు కోళ్ల దాణా ఉత్పత్తిదారులపైనా కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన కొద్ది వారాలుగా సుమారు 8 శాతం అమ్మకాలు క్షీణించాయి.

చికెన్.. కోళ్లు.. కరోనా వైరస్

Source:BBC

 

పెళ్ళికి ముందు శృంగారం నాకు ఓకే…!ready for romance before marriage!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *