ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Spread the love

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికిప్పుడు వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నా.. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంటే వైద్యం అందని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వాలు వైరస్ సోకిన వ్యక్తికి సరైన వసతి, సౌకర్యాలు ఉంటే ఇంట్లోనే గృహ నిర్భంధంలో ఉండేందుకు కూడా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే అందరం తెలుసుకున్నాం. అయినప్పటికీ ఇంట్లో ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే ఇంట్లో ఒకరికి నుంచి మరొకరి ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.

అందుకే ఇంట్లో ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే డీలాపడిపోకూడదు. ఇంట్లో ఉంటూ సరైన జాగ్రత్తలు, ఆహారం తీసుకోవడం ద్వారా ఇప్పటికే కరోనాను జయిస్తున్నారన్నది తెలుసుకోవాలి. ఇందులో కోసం అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిపెన్షన్ (CDC) అనే సంస్థ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:

  • జ్వరం, జలుబు, పొడిదగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి ప్రాథమిక లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే స్థానికంగా ఉండే వైద్య సిబ్బంది లేదా ఆరోగ్య కార్యకర్తలకు గానీ, 1902/104 టోల్ ఫ్రీ నెంబర్లకు గానీ కాల్ చేయండి.
  • వైద్యులు సూచించినటువంటి ఆరోగ్య సుత్రాలు తప్పకుండా పాటించాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ సందర్శకులను అనుమతించకూడదు.
  • వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి.
  • ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో భౌతిక దూరం పాటించండి. కేవలం భోజనం ఇవ్వటానికి మాత్రమే వారిని మీ గది వెలుపలి వరకు అనుమతించాలి.
  • ఒక వేళ ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉండాల్సి వస్తే కనీసం ఒక మీటర్ దూరం పాటించాలి.
  • అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆహారం అందించేటప్పుడు లేదా సాయం కోసం దగ్గరకు వెళ్లినప్పుడు మాస్క్, గ్లోవ్స్ ఖచ్చితంగా ధరించాలి.
  • సాధ్యమైనంత వరకు మీ గదిని మీరే శుభ్రపరచుకోండి, తరచుగా తాకే వస్తువులను, పరిసరాలను, బాత్రూమ్‌ను కూడా మీరే శుభ్రపరచుకోండి.
  • వంటకు, భోజనానికి ఉపయోగించే పాత్రల ఉపరితలాలపై వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున చేతులకు గ్లౌవ్స్ వేసుకునే వాటిని తాకాలి. అనంతరం ఉపయోగించిన గ్లౌవ్స్‌ను జాగ్రత్తగా కవర్ చేసి ఉన్న చెత్త బుట్టలో పారేయాలి. చేతులను మరోసారి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఒకవేళ స్వీయ నిర్భంధంలో ఉన్న వ్యక్తికి కరోనా సోకితే.. అతనితో కలిసిన వ్యక్తుల వివరాలు ప్రభుత్వానికి తెలియచేసి వారి రిపోర్ట్స్ కూడా నెగటివ్ వచ్చేవరకు.. అంటే 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంచాలి.

ఒకవేళ వైరస్ సోకినట్టయితే…

ఒకవేళ జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకినట్టయితే వారు రెండు వారాల పాటు స్వీయ నిర్భంధంలో ఉండాలి. అదే ఇంట్లోని మిగతా వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వైరస్ సోకినవారు ప్రత్యేక గదిలో ఉండాలి. ఇంట్లో ఎవరికీ రెండు మీటర్ల కంటే దగ్గరగా రాకూడదు. పెంపుడు జంతువులను కూడా దగ్గరకు రానీయకూడదు. వైరస్ సోకిన వ్యక్తికి ఉపయోగించేందుకు అవసరమైన వస్తువులను ప్రత్యేకంగా ఉంచాలి.

ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేస్తూ ఉండాలి. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ.. డాక్టర్ సూచించినట్టుగా ఆహారం, మందులు వాడుతూ ఉండాలి. రోగనిరోధక శక్తి, యోగాపై దృష్టి పెట్టాలి. కరోనా సోకినవారు మెడికేషన్‌తో పాటు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. మానసికంగా ధైర్యంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. కరోనా వైరస్ శరీరంలో శక్తినంతా పీల్చేస్తుంది. రోజురోజుకూ మనిషి వీక్ అయ్యేలా చేస్తుంది. అందుకే ఆకలి లేదని తినకుండా ఉండొద్దు. ఆహారం ఎక్కువగా తినాలి.

రెండు వారాల తర్వాత…

ఈ ఐసోలేషన్‌లో సుమారు పది నుంచి పద్నాలుగు రోజులు తప్పనిసరిగా ఉండాలి. జ్వరం పూర్తిగా తగ్గేవరకూ ఐసోలేషన్‌లోనే ఉండాలి. రెండు వారాల తర్వాత జ్వరం తగ్గినట్టు అనిపిస్తే.. ఒక మూడు రోజులు చూడాలి. ఎలాంటి మెడిసిన్ లేకుండా సుమారు 72 గంటల పాటు జ్వరం రాకుండా ఉంటే అప్పుడు డాక్టర్‌ను కలవాలి.

కోలుకున్న వాళ్లేం చెబుతున్నారు..

కరోనా నుంచి కోలుకున్న చాలామంది ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. వీరిని గమనిస్తే చాలామంది మానసికంగా ధృడంగా ఉండడమే కారణమని చెబుతున్నారు. వైద్యుల సూచనలు పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చేసినట్టు తెలిపారు. డైలీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని దాన్నే ఫాలో అవుతున్నారు. కొంత మంది రోజూ ఉదయాన్నే లెమన్, పసుపు, అల్లం , మిరియాలు వేసిన కషాయాన్ని తాగే వాళ్లమని చెప్తున్నారు. మరి కొందరు వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేస్తూ.. రిలాక్స్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మన నిర్లక్ష్యం వల్ల రోజురోజుకూ పెరుగుతోంది.

 

కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading