గాలి ద్వారా కరోనా వ్యాప్తి

Spread the love

*గాలి ద్వారా కరోనా వ్యాప్తి!*

*విస్మరిస్తే విజృంభణ తప్పదు*

*శాస్త్రవేత్తల హెచ్చరిక*

దిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది.

ఈ మేరకు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి.

బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు ఈ పరిశోధన చేశారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న వాస్తవాన్ని విస్మరిస్తే మహమ్మారి మరింతగా విజృంభిస్తుందని హెచ్చరించారు.

ఈ పరిశోధనకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు.

కరోనా వైరస్‌.. గాలి ద్వారా వ్యాపిస్తోందనడానికి ఆధారాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో పాలుపంచుకున్న జోస్‌ లూయిస్‌ జిమెంజ్‌ పేర్కొన్నారు.

పెద్ద తుంపర్ల ద్వారా అది విస్తరిస్తోందనడానికి ఆధారాలు పెద్దగా లేవన్నారు.

దీనికి అనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర ప్రజారోగ్య సంస్థలు.. వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై సరైన హెచ్చరికలు చేయాలని సూచించారు. *పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు..*

ఒక వ్యక్తి నుంచి ఎక్కువ మందికి వైరస్‌ వ్యాప్తి చెందిన ‘సూపర్‌ స్ప్రెడర్‌’ ఘటనలను పరిశీలించారు.

కొవిడ్‌-19 సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగని, అతను తాకిన ప్రదేశాలు, వస్తువులను స్పృశించని సందర్భాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గాలిద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.

బాహ్యప్రదేశాల్లో కంటే గదుల్లోనే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సరైన వెంటిలేషన్‌ ఉంటే దీన్ని చాలావరకు తగ్గించవచ్చని తెలిపారు. *లక్షణాలు లేని వారి నుంచీ..!*

దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు లేని అసింప్టమాటిక్‌ వ్యక్తుల నుంచి కరోనా వైరస్‌ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మొత్తం కేసుల్లో ఈ తరహా వ్యాప్తి వాటా 40 శాతం వరకూ ఉండొచ్చని మునుపటి పరిశోధనల్లోనే తేలిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విస్తరించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా వ్యవహరించిందని, గాలిలో వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఇది కూడా ఒక నిదర్శనమని చెప్పారు.

పరస్పరం సన్నిహితంగా మెలగకున్నా.. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్‌ సోకడాన్నీ నిపుణులు ఉదహరించారు.

*అప్రమత్తం కావాల్సిందే..*

గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే చర్యలను సత్వరం చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు.

రద్దీ లేకుండా చూసుకోవడం, గదుల్లో గడిపే సమయాన్ని తగ్గించుకోవడం వంటి చర్యల ద్వారా గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. గదుల్లోనూ మాస్కులు ధరించడం, మాస్కులు నాణ్యంగా ఉండేలా చూసుకోవడం, కరోనా బాధితులకు చికిత్స చేసే సమయంలో వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరించడం వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *