*రూ.399కే ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ కిట్* *మార్కెట్‌లోకి తెచ్చిన దిల్లీ ఐఐటీ*
దిల్లీ: కరోనా పరీక్షల ఖర్చును గణనీయంగా తగ్గించే ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ కిట్‌ను దిల్లీ ఐఐటీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొరోష్యూర్ పేరుతో 9 మంది దిల్లీ ఐఐటీ పరిశోధక విద్యార్థులు రూపొందించిన ఈ కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, సహాయమంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ఖరే, దిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రామ్‌గోపాల్‌రావు బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఐసీఎంఆర్ ఆమోదం పొందిన ఈ టెస్ట్ కిట్‌ను న్యూటెక్ మెడికల్ డివైజెస్ సంస్థ ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఆ సంస్థ నెలకు 20 లక్షల కిట్లు ఉత్పత్తి చేయనుంది. కిట్ ప్రాథమిక ధర రూ.399గా నిర్ణయించారు. దీనికి ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్, శాంపుల్ కలెక్షన్ ధరలు అదనం. అన్నీ కలిపితే రూ.600-700 మధ్యలో సమగ్రమైన ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయొచ్చని ఐఐటీ డైరెక్టర్ రామ్‌గోపాల్‌రావు పేర్కొన్నారు.
‘‘ఇది ఫ్లోరెసెంట్ ప్రోబ్ ఫ్రీ. ఇందులో ఎలాంటి ప్రోబ్స్ ఉపయోగించరు. అందువల్ల కిట్ ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇందులోని అన్ని పరికరాలు స్వదేశంలోనే తయారయ్యాయి’’
అని రామ్‌గోపాల్‌రావు పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణకు సంబంధించిన వివిధ అంశాల్లో పరిశోధనలు చేస్తున్న దిల్లీ ఐఐటీ.. వైరస్ నిర్మూలనలో భారతీయ సంప్రదాయ ఔషధాలు చూపే ప్రభావంపైనా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. అశ్వగంధ ఔషధం వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావశీలంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.