కరోనావైరస్ ప్రపంచ మహమ్మారిగా మారుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నవారికి పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు 666 మంది కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
కోవిడ్-19 అదుపు, నియంత్రణ, నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు శుక్రవారం ఉదయం ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు.. ఎంతమందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి.. ఎంతమందికి నిర్ధరణైంది వంటి వివరాలున్నాయి.
ఏపీలో తొలి పాజిటివ్ కేసు
ఆంధ్రలో మొదటి కరోనా కేసు నమోదయింది. ఇటలీ వెళ్లొచ్చిన నెల్లూరు వ్యక్తికి కరోనా రావడంతో ఆయన్ను ప్రభుత్వాసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ నెల ఆరవ తేదీన ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ఒక నెల్లూరు వ్యక్తికి పొడి దగ్గు వచ్చింది. దీంతో ఆయన్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డులో ఉంచారు. తిరుపతి వైరాలజీ ల్యాబులో జరిగిన పరీక్షల్లో అతనికి కోవిడ్ 19 లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణయింది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా.. | |
---|---|
విషయం | సంఖ్య |
కరోనా ప్రభావిత దేశాలకు వెళ్లొచ్చినవారు | 666 |
ఇప్పటివరకు వైద్య పరిశీలనలో ఉంచినవారు | 564 |
28 రోజుల వైద్య పరిశీలన పూర్తయినవారు | 233 |
ఇంకా వైద్య పరిశీలనలో ఉన్నవారు | 331 |
ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నవారు | 12 |
ఇళ్లలోనే పరిశీలనలో ఉన్నవారు | 319 |
ఇప్పటివరకు పరీక్షించిన శాంపిళ్లు | 55 |
పాజిటివ్‌గా తేలినవారు(కరోనా నిర్ధరణయిన కేసులు) | 1 |
నెగటివ్‌గా తేలినవారు | 47 |
పరీక్షల ఫలితాలు రావాల్సినవి | 7 |
విదేశాలకు వెళ్లొచ్చినవారిలో ఇంకా పరిశీలనకు దొరకనివారు | 102 |
8,467 మందికి స్క్రీనింగ్
ఏపీలోని అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 8,467 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించగా వారిలో 64 మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల్లో వరుసగా 599, 1088 మందికి స్క్రీనింగ్ నిర్వహించగా ఎవరిలోనూ కరోనావైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు.
వ్యక్తిగత శుభ్రతతోనే అడ్డుకట్ట
ప్రజలు బయటకు వెళ్లినప్పుడు మాస్కులు వేసుకోవాలనీ, తరచూ చేతులు కడుక్కోవాలనీ, శుభ్రత పాటించాలనీ ప్రభుత్వం కోరింది.
సలహాలు, సమాచారం కోసం 0866 2410978 లేదా 104 నంబరుకు కాల్ చేయాలని సూచించింది.
ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారు, తమకు ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా, 28 రోజుల పాటూ తమకు తాముగా ఇసోలేషన్లో, అంటే ఎవరితో కలవకుండా, దగ్గరగా మసలకుండా జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలని సూచించింది ప్రభుత్వం.
ఒకవేళ దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మాస్కు వేసుకుని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలనీ, అందుకోసం అవసరమైతే ఉచితంగా 108 వాడుకోవాలని సూచించింది.
Content retrieved from: https://www.bbc.com/telugu/india-51866944.