కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారతీయ శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్ దఖావే భోసలే

Spread the love

కొత్త కరోనావైరస్ మీద పోరాటంలో ప్రజలకు తగినంతగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం లేదని భారతదేశం విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే.. ఒక వైరాలజిస్ట్ కృషితో ఆ పరిస్థితి మారబోతోంది.

ఆ వైరాలజిస్ట్ ఒక బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు.. దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ (పరీక్ష పరికరం)ను తయారు చేసి అందించారు.

మొట్టమొదటి మేడిన్ ఇండియా కరోనావైరస్ టెస్టింగ్ కిట్ గురువారం మార్కెట్‌లోకి వచ్చింది. ఫ్లూ లక్షణాలు గల రోగులకు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ఉందా, లేదా అనేది నిర్ధారించటానికి మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేయవచ్చుననే ఆశలను ఇది పెంచింది.

పుణెలోని ‘మైల్యాబ్ డిస్కవరీ’ అనే సంస్థ.. కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను తయారు చేసి, విక్రయించటానికి పూర్తి స్థాయి అనుమతి పొందిన తొలి భారతీయ సంస్థగా నిలిచింది. ఆ సంస్థ ఈ వారంలో 150 కిట్లను తయారు చేసి పుణె, ముంబై, దిల్లీ, గోవా, బెంగళూరుల్లోని డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు పంపించింది.

”మా తయారీ విభాగం నిరంతరం పనిచేస్తోంది. సోమవారం మరో బ్యాచ్ టెస్టింగ్ కిట్లను పంపిస్తాం” అని మైల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ వాంఖడే శుక్రవారం నాడు బీబీసీతో చెప్పారు.

ఈ మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ.. హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి తదితర వ్యాధులకు కూడా వ్యాధినిర్ధారణ పరీక్ష కిట్లను తయారు చేస్తోంది. తాము వారానికి 1,00,000 కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను సరఫరా చేయగలమని.. అవసరమైతే 2,00,000 కిట్ల వరకూ ఉత్పత్తిని పెంచగలమని ఆ సంస్థ చెప్తోంది.

ఒక్కో మైల్యాబ్ కిట్.. 100 నమూనాలను పరీక్షించగలదు. ఒక్కో కిట్ ధర 1,200 రూపాయలు. ప్రస్తుతం భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కోవిడ్-19 టెస్టింగ్ కిట్ ధర రూ. 4,500గా ఉంది.

టెస్టింగ్ కిట్‌కు ప్రాణం పోసిన కొన్ని గంటలకే ప్రసవం…

”దిగుమతి చేసుకున్న టెస్టింగ్ కిట్‌లు ఫలితాలను చూపటానికి ఆరు, ఏడు గంటల సమయం తీసుకుంటాయి. కానీ మా టెస్టింగ్ కిట్ కేవలం రెండున్నర గంటల్లోనే ఫలితాలు చూపిస్తుంది” అని మైల్యాబ్ సంస్థలో పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి, వైరాలజిస్ట్ మీనల్ ధవే భోసలే చెప్పారు.

కోవిడ్-19ను గుర్తించటానికి పాథో డిటెక్ట్ అనే ఈ పరీక్ష కిట్‌ను రూపొందించిన బృందానికి ఆమె సారథ్యం వహించారు. ఈ కిట్‌ను రికార్డు స్థాయిలో కేవలం ఆరు వారాల సమయంలోనే తయారు చేశామని ఆమె తెలిపారు.

ఈ కిట్ తయారీ కోసం పనిచేస్తున్నప్పుడు.. ఈ శాస్త్రవేత్త నిండు గర్భిణి కూడా. గత వారంలోనే ఆమె ప్రసవించారు. ఆమె గర్భానికి సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఫిబ్రవరిలో డిస్చార్జ్ అయిన కొద్ది రోజులకే ఈ టెస్టింగ్ కిట్ తయారీ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యారు.

”ఇది అత్యవసర పరిస్థితి. దీనినొక సవాలుగా స్వీకరించా. నా దేశానికి నేను సేవ చేయాలి. పది మంది సభ్యులున్న మా బృందం చాలా కష్టపడి పనిచేసి ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది” అని చెప్పారు.

మీనల్ చివరికి మార్చి 18వ తేదీన తమ టెస్టింగ్ కిట్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) విశ్లేషణ కోసం సమర్పించారు.

 

source: BBC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *