*కరోనాకు నో ఎంట్రీ*
కొవిడ్-19 ధాటికి ప్రపంచమంతా గడగడలాడుతుంటే, కొన్ని దేశాలు మాత్రం దాన్ని తమ గడ్డమీదకు అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఇవన్నీ పేరుకు దేశాలే కానీ, దాదాపు అన్నీ బుల్లి బుల్లి ద్వీపాలే! పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉండటం వల్ల సహజంగానే ఐసోలేషన్‌లో ఉంటాయివి. దాంతో పాటు ఇవి తీసుకున్న చర్యలూ వైరస్‌ను నిలువరించగలిగాయి. జులై 20 నాటికి ఒక్క కోవిడ్-19 కేసూ నమోదవ్వని ఆ దేశాలేంటో చూద్దామా!_
*సమోవ*
ఈ పసిఫిక్ దేశం మార్చి 21నే తన సరిహద్దులన్నీ మూసేసింది. గతంలో వచ్చిన మీజిల్స్‌తో ఇక్కడ పదులు సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జనాభాలో దాదాపు రెండు శాతం మంది దీని బారినపడ్డారు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ దేశం కరోనా తన తీరానికి రాకుండా ఎమర్జెన్సీ పెట్టింది. బహిరంగ కార్యకలాపాలన్నింటినీ నిలిపేసింది. 1962లో న్యూజి లాండ్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఈ దేశం ప్రధాన ఆదాయ వనరులు వ్యవసాయం, చేపలవేట, అడవులు, పర్యాటకం, సేవారంగం, ఇతర దేశాల గ్రాంట్లు. *జనాభా:* 1.95 లక్షలు *రాజధాని: అపియా*
*మార్షల్ ఐలాండ్స్* మధ్య పసిఫిక్ మహా సముద్రంలో 29 పగడపు దీవులు, వాటిలో మళ్లీ చిన్న చిన్న దీవులు, మరో అయిదు పెద్ద దీవుల సముదాయం. ఏప్రిల్ చివర్లో కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కింద ప్రపంచ బ్యాంకు ఈ దేశానికి రూ.18 కోట్ల నిధులు అందించింది. ప్రపంచమంతా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దేశం మార్చి 8నే తన బోర్డర్లను మూసేసింది. తాజాగా జులై 5న మరోసారి బయటి దేశాల నుంచి ప్రయాణాల మీద నిషేధం నెలపాటు పొడిగించారు. దాంతో దేశంలో ఒక్క కేసూ నమోదు కాలేదు. *రాజధాని: మాజురో* *జనాభా:* 58 వేలు
*కిరిబాటి* 33 పగడాల దీవుల సమూహం. అత్యంత పేద దేశాల్లో ఒకటి. మార్చిలోనే ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ’ని ప్రకటించి.. ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలను ఆపేసింది. కరోనా సోకినట్టు భావిస్తున్న ఓ రష్యా నావికుడికి చికిత్స చేసి పంపించేసింది. స్థానికుల్లో ఎవరికీ వైరస్ సోకలేదు. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్న ఈ దేశంలో అత్యవసర వైద్యసేవల ఏర్పాట్ల కోసం ప్రపంచబ్యాంకు రూ.18.80 కోట్ల రుణాన్ని అందిస్తోంది. *జనాభా:* 1.16 లక్షలు *రాజధాని: టరవా*
*వనౌటు* దక్షిణ ఫసిఫిక్ సముద్రంలో ఆస్ట్రేలియాకు తూర్పుగా 1750 కి.మీ దూరంలో ఉండే 83 ద్వీపాల సమూహమిది. క్రియాశీల అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. వ్యవసాయం, చేపలవేట, పర్యాటకం మీద ఎక్కువగా ఆధారపడ్డ దేశం. కరోనాను నిరోధించడానికి మార్చి 26న ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. విమాన, నౌకాశ్రయాలను మూసేసింది. అంతర్గత ప్రయాణాలనూ నిషేధించింది. దీంతో పర్యాటక పరిశ్రమ దెబ్బతిన్నా, కరోనా తమ గడ్డ మీద కాలుమోపకుండా చూసుకోగలిగింది. కానీ, ఈ ఆనందం వాళ్లకి దక్కకుండా ‘హెరాల్డ్’ తుపాను విరుచుకుపడింది. ఇళ్లూ, పంటలూ బాగా దెబ్బతిన్నాయి. 2 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు! *జనాభా* : 3 లక్షలు *రాజధాని: పోర్ట్ విలా*
*టోంగా* దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కేవలం 750 చదరపు కిలోమీటర్లు ఉన్న చిన్ని ద్వీప దేశమిది. వెంటిలేటర్లు, మానిటర్లు, పీపీఈ కిట్లు లాంటి వైద్య పరికరాల కొనుగోలు ద్వారా ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసుకోడానికి ఇటీవల ప్రపంచ బ్యాంకు దీనికి 2.9 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. కరోనా నేపథ్యంలో ఈ దేశం విడతల వారీగా లాక్‌డౌన్ విధించి, ప్రస్తుతం ఆగస్టు 4 వరకూ పొడిగించింది. టోంగా చుట్టుపక్కల దేశాల్లో అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ప్రధాని పోహివా తెలిపారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారి 5 వరకూ కర్ఫ్యూ, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటం మీద నిషేధం లాంటివి ఇక్కడ కొనసాగుతున్నాయి. *జనాభా:* లక్ష *రాజధాని: నుకు అలోఫా* *సోలొమన్ దీవులు*
ఆరు పెద్ద, తొమ్మిదొందలు పైచిలుకు చిన్న ద్వీపాల సముదాయం. కరోనా కారణంగా మార్చి 25నే పౌర అత్యయిక పరిస్థితి ప్రకటించింది. కార్గో విమానాలు మినహా మిగిలిన అన్ని ప్రయాణాల్ని నిషేధించారు. పాఠశాలలు, పపువా న్యూగినియాతో ఉన్న సముద్ర సరిహద్దులన్నింటినీ మూసేశారు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యింది. సేవా రంగం, చేపలు, టింబర్, పామాయిల్ ఎగుమతుల్లాంటి ప్రధాన ఆదాయ వనరులు దెబ్బ తిన్నాయి. పైగా పౌర నిరసనలు, భూకంపాలు, సునామీలతో కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్ని చవిచూసింది. గోరుచుట్టుపై రోకటిపోటులా కోవిడ్ మరింత దెబ్బతీసింది. *జనాభా:* 6.80 లక్షలు *రాజధాని: హోనియార*
*నౌరు* నైరుతి పసిఫిక్ మహా సముద్రంలో ఉండే ఈ ద్వీపదేశం, ప్రపంచంలో రెండో అతి చిన్న దేశం. నిజానికీ దేశానికి అధికారిక రాజధాని లేదు. యారెన్ జిల్లా నుంచి అధికారులు పనిచేస్తారు. వ్యవసాయం, చేపలవేట, పర్యాటకం, తయారీ రంగం ఓ మోస్తరుగా ఉంటాయి. ఫాస్ఫేట్ ఎగుమతులెక్కువ. కరోనా కల్లోలం మొదలవగానే వేగంగా స్పందించి అన్ని దేశాలకు, దగ్గరలోని దీవులకు విమాన రాకపోకలు ఆపేసింది. రెండువారాలకి ఒకసారి ఆస్ట్రేలియాకి ఒకే ఒక్క విమానం నడిపింది. ఈ దేశం మొత్తం మీద ఒకే ఒక్క ఆస్పత్రి ఉంది. అందులో కనీసం వెంటిలేటర్లు కూడా లేని పరిస్థితి. అందుకే వైరస్ అసలు రాకుండా కాచుకోవడానికే సిద్ధమైంది. ఇప్పటి వరకైతే విజయవంతమైంది. *జనాభా:* 11 వేలు *రాజధాని: యారెన్*
*పలౌ* ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో రెండు వందలకు పైగా అగ్నిపర్వత సంబంధ, పగడపు దీవులతో నిండిన దేశమిది. 1994లో స్వాతంత్య్రం పొందిన పలౌ ఆర్థికంగా అమెరికా అందించే నిధుల మీదే ఆధారపడుతుంది. పర్యాటక రంగం ప్రధాన ఆదాయ నవరు. కరోనా కలకలం పెరుగుతున్న మార్చి చివరివారంలోనే పలౌ తన సరిహద్దులను మూసేసింది. అంతకు ముందు నుంచే దేశంలోకి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు జరుపుతూ ఉంది. వారం వ్యవధిలోనే క్వారంటైన్ సౌకర్యం, ఐసోలేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకుంది. తైవాన్ నుంచి టెస్టుకిట్లు, వెంటిలేటర్లు, ఇతర సామగ్రి తెచ్చుకుంది. *జనాభా:* 20 వేలు *రాజధాని: న్గెరుల్‌మడ్* *టువాలు*
టినో సైక్లోన్ కారణంగా జనవరి చివర్లోనే ఈ దేశం ఎమర్జెన్సీ ప్రకటించింది. కొవిడ్-19 నేపథ్యంలో దాన్ని పొడిగిస్తూ వెళ్లారు. మార్చి మూడు నుంచే టువాలు తన సరిహద్దులన్నింటినీ మూసేసింది. ఆ సమయంలో కరోనా లేని దేశం నుంచి వచ్చే వారు మినహా మిగిలిన ఎవరైనా కచ్చితంగా 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండేలా చూశారు. ఆహారం, మందులు, ఇంధనం, కార్గో లాంటివి తప్ప వేటినీ దేశంలోకి అనుమతించ లేదు. కొవిడ్-19 హెల్త్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్కూళ్లు, చర్చ్‌లు మూసేసింది. పుకార్లు వ్యాప్తి చేసే వారికి జరిమానాలు విధించింది. తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదైనా వెంటనే మార్షల్ లా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. *రాజధాని: ఫునాఫుటి* *జనాభా* : 11 వేలు *తుర్క్‌మెనిస్థాన్* అఫ్గానిస్థాన్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్‌లతో సరిహద్దులున్న ఈ మధ్య ఆసియా దేశంలో కోవిడ్-19 కేసులేవీ లేవు. చైనాతో పాటు కరోనా కేసులు తీవ్రంగా ఉన్న దేశాలకు విమాన ప్రయాణాల్ని ఫిబ్రవరి మొదట్లోనే ఈ దేశం రద్దు చేసింది. దేశంలోకి వచ్చే అంతర్జాతీయ విమానాల్ని తుర్క్‌మెనాబాట్‌కు మళ్లించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ జోన్లలో అందరికీ పరీక్షలు జరిపింది. మార్చిలో తన సరిహద్దుల్ని దాదాపుగా మూసేసింది. అయితే, నిరంకుశ పాలన సాగుతున్న ఒకప్పటి ఈ సోవియట్ దేశంలో కరోనా కేసులున్నా బయటి ప్రపంచానికి తెలియడం కష్టమే! అలాగే ఉత్తర కొరియా కూడా తన భూభాగంలో ఒక్క కరోనా కేసూ లేదని చెబుతున్నా ప్రపంచం నమ్మని పరిస్థితి. *రాజధాని: అష్గబాట్* *జనాభా:* 56 లక్షలు
*మైక్రోనీసియా* పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దేశం అనేక ద్వీపాల కూడిక. సంస్కృతి భాష పరంగా దీన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించారు. వ్యవసాయం, చేపల వేట ప్రధాన వృత్తులు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం అమెరికా దీనికి గ్రాంట్ ఎయిడ్ అందిస్తూ వస్తోంది. ఇదే దీనికి ప్రధాన ఆదాయం. కరోనా గురించి తెలియగానే ఈ దేశం ప్రయాణాలను పూర్తిగా నిలిపివేసింది. కొవిడ్-19 సోకిన బయటి దేశాల సందర్శకులెవరినీ రానివ్వలేదు. ఆయా దేశాలకు తన ప్రజల ప్రయాణాల్నీ నిషేధించింది. *జనాభా* : 5.40 లక్షలు *రాజధాని: పాలికిర్*