*పోలింగ్ కేంద్రాలే టీకా శిబిరాలు* *పౌరులందరికీ వ్యాక్సిన్‌ను చేరవేసేలా కేంద్రం వ్యూహ రచన*
దిల్లీ: మహమ్మారి కరోనాను నిలువరించే సమర్థ టీకా అందుబాటులోకి రాగానే భారతీయులందరికీ దాన్ని చేరవేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది.
పోలింగ్ కేంద్రాలను టీకా శిబిరాలుగా ఏర్పాటుచేసి.. వాటిలోనే అందరికీ వ్యాక్సిన్ వేయించాలని భావిస్తోంది.
‘‘కరోనాపై ముందుండి పోరాడుతున్న ఆరోగ్యరంగ సిబ్బంది వంటి యోధులకు టీకాను తొలి దశలోనే ప్రభుత్వం అందిస్తుంది.
తర్వాత ప్రతి భారతీయుడికీ దాన్ని చేరవేయాలన్నది ప్రణాళిక. ఇది సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకోసం రకరకాల వ్యూహాలను ప్రభుత్వం పరిశీలించింది.
పోలింగ్ కేంద్రాలను టీకా శిబిరాలుగా ఉపయోగించుకుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చింది! ఒక్కో పోలింగ్ బూతులో సగటున 900 మంది ఓట్లు వేస్తుంటారు. అదే తరహాలో ఒక్కో శిబిరంలో 900 మందికి టీకా వేయడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇందుకోసం ఓటర్ల జాబితా, ఆధార్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఓటుహక్కు లేనివారు కూడా సమీపంలోని శిబిరంలో వ్యాక్సిన్ వేయించుకునేలా ఏర్పాట్లు చేయవచ్చు.
ప్రతి ఒక్క భారతీయుడికీ చేరేలా టీకా కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగించవచ్చు’’ అని ఓ అధికారి వివరించారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్న సంగతి గమనార్హం.