ప్లాస్మా కావలెను

Spread the love

*ప్లాస్మా కావలెను!*

*ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌*

*దాతల కోసం వెతుకులాట*

*ముందుకు రావాలంటూ బాధితుల వినతులు*

*సొమ్ము చేసుకుంటున్న కొందరు*

*ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఏ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపున్న కొవిడ్‌ బాధితునికి అత్యవసరంగా ప్లాస్మాథెరపీ అవసరమని వైద్యులు సూచించారు. ప్లాస్మాదాతలు దయచేసి ఈ నెంబరులో సంప్రదించగలరు.*

_మా సమీప బంధువు కొవిడ్‌ బారినపడ్డారు. ఆయన వయసు 65 ఏళ్లు. ఏ నెగెటివ్‌ బ్లడ్‌గ్రూపున్న ప్లాస్మాదాత వెంటనే సంప్రదించగలరు. మీ సాయాన్ని ఎప్పటికీ మరువలేం.. – *సామాజిక మాధ్యమాల్లో కొందరి వినతులివి*

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ తీవ్రతకు ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్రయోగాత్మకంగా అందిస్తోన్న ‘ప్లాస్మాథెరపీ’కి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అయితే ప్లాస్మా దాతలు తగినంతగా లభించకపోవడం విషమ పరిస్థితికి దారితీస్తోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు రాష్ట్రంలో పెద్దసంఖ్యలోనే ఉన్నా అవసరాలకు తగ్గట్లుగా ప్లాస్మా లభించడం లేదు. దీంతో దాతలు ముందుకు రావాలని కోరుతూ బాధితుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ వారిని బతికించుకోవడం కోసం దాతలకు ఎంతైనా చెల్లించడానికి బాధిత కుటుంబాలు ముందుకొస్తున్నాయి. ప్రాణదాతలుగా గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో.. బాధితుల బలహీనతను కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. _రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో.. రోజుకు సుమారు 1500-1900 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో రోజుకు 30-50 మందిలో వైరస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది._ ఇటువంటి వారిలో పరిస్థితి విషమించినప్పుడు.. ‘ప్లాస్మాథెరపీ’ని ప్రయోగాత్మక చికిత్సగా వైద్యులు అందిస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 37,745 మంది కరోనా బారినపడగా, వీరిలో 24,840 మంది కోలుకున్నారు. అయితే వీరిలో ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రి సహా రాష్ట్రంలోని ఇతర కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ కలుపుకొని ప్లాస్మాను దానం చేసినవారు మాత్రం 100 మంది లోపే కావడం గమనార్హం. దీనికి రకరకాల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. *ఇందులో ప్రధానమైనవి..* * మొత్తం కోలుకున్నవారిలో దాదాపు 50 శాతం మంది అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుంటారని అంచనా. * ప్రధానంగా 18-50 ఏళ్ల లోపు వారినుంచే ప్లాస్మాను సేకరిస్తారు. ఈ వయసు వారిలోనూ ఆరోగ్యవంతులు సుమారు 40 శాతం మంది ఉంటారని ఒక విశ్లేషణ. అంటే మొత్తం కోలుకున్నవారిలో 8-9 వేల మంది ఉంటారు.

* వీరిలోనూ కరోనా యాంటీబాడీస్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందినవారి నుంచే ప్లాస్మాను తీసుకుంటారు. కొవిడ్‌ లక్షణాలు బయటకు కనిపించకుండా, కేవలం పరీక్షల్లో కరోనా అని నిర్ధారణ అయి, ఎటువంటి సమస్యలు లేకుండా తగ్గిపోయిన వారిలో ఇలా యాంటీబాడీస్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* ఇలా లక్షణాలు లేనివారు కూడా దాదాపు 80 శాతం మంది ఉంటుండంతో.. వీరిలో ఎందరిలో యాంటీబాడీస్‌ పూర్తిగా అభివృద్ధి చెందాయి? ఎందరిలో అభివృద్ధి చెందలేదనే స్పష్టత మాత్రం ఇప్పటివరకూ లేదు.

* వీరిలోనూ సుమారు 50 శాతం మందిలో ప్లాస్మా ఇవ్వడానికి అనుకూలత లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే మరో 4 వేల మంది కూడా ప్లాస్మా ఇవ్వడానికి అర్హులు కారనేది తెలుస్తోంది.

* రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం 12.5 కంటే తక్కువగా ఉన్నా, 55 కిలోల బరువు కంటే తక్కువగా ఉన్నా కూడా ప్లాస్మా దానానికి అంగీకరించరు.

* ప్లాస్మా దానం చేసే సమయంలో ఎటువంటి వైరల్‌ వ్యాధుల బారిన పడి ఉండకూడదు.

* ఈ అన్నింటిని పరిగణనలోకి తీసుకున్నా యాంటీబాడీస్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన కరోనా విజేతలు కూడా రాష్ట్రంలో సుమారు 5 వేల మంది వరకూ ఉంటారని అంచనా.

* ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఇప్పటివరకు ప్లాస్మా దానానికి ముందుకు రావడం గమనార్హం. *అపోహ.. బయటపడటం ఇష్టం లేక…* సాధారణ రక్తదానంపైనే ప్రజల్లో ఇప్పటికీ అపోహలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్లాస్మా అనేసరికి దీనివల్ల ఇంకా కొత్త సమస్యలేమైనా వస్తాయేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్మాదాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చే విధంగా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసి, అర్హులైన వారందరిని అందులో చేర్చి, వారిని చైతన్యపర్చడం ద్వారా ప్లాస్మా కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. *ఇందులోనూ వ్యాపార ధోరణి* ఇటీవల హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితునికి ప్లాస్మా అవసరమై, దాతను సంప్రదించారు. దాత ఆసుపత్రికొచ్చి ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అప్పటికి బాధితుని ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో.. ఇప్పుడు ప్లాస్మా అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆ దాత వెనక్కి వెళ్తుండగా.. ఆ ఆసుపత్రి ఉద్యోగి పక్కకు పిలిచి, అదే గ్రూపు బాధితులు ఇంకా పెద్దసంఖ్యలో వస్తుంటారనీ, ప్లాస్మా దానం చేయడం ద్వారా వారి నుంచి పెద్దఎత్తున వసూలు చేసుకోవచ్చని సూచించాడు. అప్పటివరకూ ప్లాస్మాను అమ్ముకోవచ్చనే ఆలోచన లేని ఆ దాత.. చివరకు రూ.లక్ష తీసుకొని దానం చేశారు. ఇది ఒక సంఘటనే. ఇలాంటివి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దాతలకు రూ.లక్షలు ఇచ్చి, ముందస్తుగానే వారి నుంచి ప్లాస్మాను స్వీకరిస్తున్నారు. బాధితునికి అవసరమైన సందర్భంలో.. ముందే స్వీకరించిన ప్లాస్మాను మరింత ఎక్కువ ధరకు ఆసుపత్రి వర్గాలే విక్రయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇంకొందరైతే అసలు దాతలు కాకపోయినా.. బాధితుల విజ్ఞప్తులను చూసి, తమను దాతలాగా పరిచయం చేసుకొని, రూ.2-3 వేల వరకూ ముందుగా జమ చేయమని అడుగుతున్నారు. ఆ తర్వాత ఆ నకిలీ దాత జాడ తెలియడం లేదు. *రెండుసార్లు ప్లాస్మా ఇచ్చా* _రాష్ట్రంలో మొదటిసారి ప్లాస్మా దానం చేసింది నేనే. ఇప్పటివరకు రెండుసార్లు చేశా. అవసరమైతే మరికొన్నిసార్లు కూడా చేస్తాను. ఇందులో భయాందోళనలు అవసరం లేదు. చాలా సాధారణ ప్రక్రియ ద్వారా ప్లాస్మాను స్వీకరిస్తారు. ప్లాస్మా దానంపై ఎక్కువమందిని చేర్చడంలో భాగంగా ఒక గ్రూపు ఏర్పాటుచేశాం. ఇందులో తెలంగాణ నుంచి 50 మందివరకు ఉన్నాం. – *ఎన్నంశెట్టి అఖిల్‌, న్యాయవాది, వరంగల్‌*_

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *