ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని చిరంజీవి ఎందుకు కలవబోతున్నారనే అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే జగన్‌ని చిరంజీవి కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం సైరా నరసింహా రెడ్డి విజయాన్ని ఆయనతో పంచుకొని, సినిమా చూడమని కోరేందుకే ఈ భేటీ అని టాక్ నడుస్తోంది. అలాగే సైరాకు జగన్ అందించిన సహకారం పట్ల కూడా చర్చ సాగనుందని తెలుస్తోంది.
సైరా జైత్రయాత్ర.. కలెక్షన్ల సునామీ..
చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ప్రముఖులను కలుస్తూ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను కలిసి సైరా సినిమా చూడాలని కోరారు. ప్రత్యేక షో వేసి చూపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌ను కలవబోతున్నారు.
కంగ్రాట్స్.. స్పెషల్ థ్యాంక్స్ …
జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి చిరంజీవి ఆయన్ను నేరుగా కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌కు కంగ్రాట్స్ కూడా చెప్పనున్నారట చిరు. సైరా రిలీజ్ సందర్భంగా ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు గాను చిరంజీవి థ్యాంక్స్ చెప్పనున్నారు. అలాగే సైరా సినిమాను చూడవలసిందిగా జగన్‌ను మెగాస్టార్ కోరనున్నారు.
కీలక నిర్ణయం తీసుకోనున్నారా..?
ఇక జగన్ – చిరంజీవి భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం కూడా తీసుకోనుందని టాక్ నడుస్తోంది. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కర్నూలు జిల్లాకు చెందినవారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహా రెడ్డి సినిమాను తెరకెక్కించారు. దీంతో ఏపీ ప్రభుత్వం సైరాకు వినోద పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ భేటీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో!.