కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్ లో కంగనా రానుయాత్:
కేవలం కథానాయికగా మాత్రమే చేస్తూ తన ప్రతిభకు హద్దులు గీసుకోవడం లేదు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. వచ్చే ఏడాది జనవరిలో తన నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారామె. ‘‘నా కొత్త నిర్మాణ సంస్థను జనవరిలో మొదలు పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ముందుగా చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే కథలను సిద్ధం చేస్తున్నాం. నా వద్దకు వచ్చే ప్రతి కథలో నేను నటించడం కుదరకపోవచ్చు. కానీ మంచి కథలు వెండితెరపై రావాల్సిన అవసరం ఉంది.
ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. వాళ్లతో సినిమాలు తీస్తా. నా ప్రొడక్షన్‌లో నేను నటించాలనుకోవడం లేదు. అలాగే మా సంస్థను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ విస్తృతపరచాలనుకుంటున్నాం. ఇక నా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వస్తుంది. కాకపోతే ‘థాకడ్’ సినిమా తర్వాతే దర్శకత్వంపై నేను పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’’ అని కంగనా రనౌత్ తెలిపారు. మణికర్ణిక ఫిల్మ్స్ అనేది కంగనా రనౌత్ ప్రొడక్షన్ టైటిల్ అని బాలీవుడ్ సమాచారం. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’తో కథానాయికగా కంగనా బిజీగా ఉన్నారు.