తపాలా పూర్తిస్థాయి సేవలు
నేటి నుంచే ఆసరా పింఛన్ల పంపిణీకీ సన్నద్ధం
హైదరాబాద్, హన్మకొండలో ఇంటి వద్దకే సేవలు
హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో తపాలా శాఖ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పరిమితంగా సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రధాన తపాలా కార్యాలయం (జీపీఓ) సహా రాష్ట్ర వ్యాపంగా 37 ప్రధాన కార్యాలయాలే పనిచేస్తున్నాయి.
ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదువేల శాఖల ద్వారా ఉత్తరాల బట్వాడా, నగదు లావాదేవీలు, ఇండియా పోస్ట్‌పేమెంట్ బ్యాంకు, మనీయార్డర్, ప్రీమియం చెల్లింపుల వంటి అన్ని సేవలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు తెలంగాణ సర్కిల్ ప్రధాన పోస్టుమాస్టర్ జనరల్ సంధ్యారాణి తెలిపారు. ‘‘విమానాలు, రైళ్లు రద్దవడం, రోడ్డు రవాణా స్తంభించిన నేపథ్యంలో స్పీడ్ పోస్టు సేవలపై మాత్రం ప్రభావం ఉంటుంది.
హైదరాబాద్, హన్మకొండ శాఖల పరిధిలో నాలుగు రోజులుగా నగదు లావాదేవీలు, స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు వంటి సేవలను ఖాతాదారుల ఇళ్ల దగ్గరికే వెళ్లి అందిస్తున్నాం. అందుకోసం హైదరాబాద్‌లో 3, హన్మకొండలో 1 చొప్పున మొబైల్ డెలీవరీ వ్యాన్లను వినియోగిస్తున్నాం. రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మందులు, సెలైన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, శస్త్ర చికిత్స పరికరాల బట్వాడాను నిరంతరం కొనసాగిస్తాం.
ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకూ సిద్ధంగా ఉన్నాం. నగదు కోసం సంబంధిత బ్యాంకులతో మాట్లాడుతున్నాం. సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం 10 వేల శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లను ఒకట్రెండు రోజుల్లో అందిస్తాం’’ అని సంధ్యారాణి తెలిపారు.
మరో వారంలో..ఉల్లి ధరలు తగ్గుతున్నాయ్..