నేటి నుంచి వెబ్‌సైట్లో ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావచ్చు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ‘ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్ హాల్‌టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ప్రిన్సిపాల్, ఇతర అధికారుల సంతకం అవసరం లేదు’ అని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టంచేశారు. మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆమె గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాళ్లు ఎవరూ విద్యార్థుల ఇంటర్ హాల్‌టికెట్లను ఆపవద్దని సూచించారు.
సమస్యలుంటే ఫిర్యాదు చేయండి
విద్యార్థులకు సమస్యలుంటే జిల్లా పరిధి డీఐఈఓ కార్యాలయంలోని జిల్లా కంట్రోల్ రూమ్‌లో లేదా ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్(బిగ్‌ఆర్‌ఎస్) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చిత్రారామచంద్రన్ పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డులో రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు కంట్రోల్ రూమ్‌కు(040-24600110) ఫోన్ చేసి చెప్పవచ్చని సూచించారు. పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు ఇంటర్‌బోర్డు సెంటర్ లొకేటర్ యాప్‌ను రూపొందించిందని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి tsbie.m-services ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
పరీక్షలయ్యాక మూసేస్తాం
అగ్నిమాపక శాఖ అనుమతుల్లేని 68 జూనియర్ కళాశాలలకు నోటీసులు ఇచ్చాం 18 శ్రీచైతన్య, 26 నారాయణ కాలేజీలున్నాయి ఇప్పుడు మూసేస్తే విద్యార్థులకు ఇబ్బంది
హైకోర్టుకు నివేదించిన ఇంటర్‌బోర్డు
హైదరాబాద్: అగ్నిమాపక శాఖ అనుమతుల్లేని 68 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఇంటర్ బోర్డు గురువారం హైకోర్టుకు నివేదించింది. ప్రస్తుతం పరీక్షల షెడ్యూలు ప్రారంభమైనందున మార్చి 28 తర్వాత వాటిని మూసివేయిస్తామని, అప్పటివరకు గడువు ఇవ్వాలని కోరింది.
సరైన అనుమతుల్లేని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన డి.రాజేశ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ 18 శ్రీచైతన్య, 26 నారాయణ కాలేజీలతోపాటు ఇతర కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. షోకాజ్ నోటీసులు కంటి తుడుపు చర్యలని ధర్మాసనం వ్యాఖ్యానించగా నోటీసులివ్వకుండా మూసివేతకు ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయవాది తెలిపారు. కాలేజీలకు ఈనెల 22న నోటీసులు జారీ చేశామని, కొన్ని వివరణలు ఇస్తున్నాయన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని శ్రీచైతన్య కాలేజీ వివరణ ఇచ్చిందా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదని న్యాయవాది సమాధానమిచ్చారు. మరెందుకు దాని గుర్తింపును రద్దు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, మార్చి 28 తర్వాత మూసివేస్తామని దీంతో విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేస్తూ ఎన్ని కాలేజీలను మూసివేశారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఆ కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులు
ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తయ్యాయని, మరో 8 రోజుల్లో రాత పరీక్షలు మొదలవుతాయని, రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలయ్యాక అగ్నిమాపక శాఖ అనుమతుల్లేని కాలేజీలను మూసివేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ అఫిడవిట్ దాఖలు చేశారు. 68 కాలేజీలకు నోటీసులు జారీ చేశామని, వాటిలో 29,808 మంది విద్యార్థులు ఉన్నారన్నారు.