ప్రమాణస్వీకారం రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ సచివాలయాన్ని ఏర్పాటుచేసి ప్రతి ఊర్లో 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చారు. గాంధీ జయంతి (అక్టోబరు 2) నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నాటికి 4లక్షల మందిని గ్రామ వాలంటీర్‌లుగా నియమిస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారన్న జగన్.. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకే వీరిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రలో అవినీతికి తావులేకుండా చేస్తామని స్పష్టంచేశారు.
ఆయన మాట్లాడుతూ :
“ఆగస్టు 15 నాటికి 4 లక్షలు వాలంటీర్లను నియమిస్తాం. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేయబోతున్నాం. లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. సేవల చేయాలనుకునే పిల్లలను వాలంటీర్లుగా అవకాశమిస్తాం. గ్రామ వాలంటీర్‌కు రూ.5 వేలు జీతం ఉంటుంది. వేరే మంచి ఉద్యోగాలు వచ్చే వరకు వారు వాలంటీర్లుగా పనిచేయవచ్చు.
అక్టోబరు 2 నాటికి గ్రామ సచివాలయ ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ గ్రామంలో 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. పెన్షన్, ఇళ్లు, ఆరోగ్యశ్రీ, రీయింబర్స్‌మెంట్ ఇలా నవరత్నాల్లో ఏది కావాలన్నా గ్రామ సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే మంజూరు చేస్తాం. గ్రామ వాలంటీర్లు, సచివాలయంతో కలిసి ప్రభుత్వ పథకాలను నేరుగా గ్రామలకు చేరుస్తాం. ప్రభుత్వ పాలన ప్రక్షాళన చేస్తాం.”అని ప్రకటన చేసారు.