కరోనా ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా 13 కోట్ల ఉద్యోగాలకు కోత

Spread the love

కరోనా ఎఫెక్ట్ దాదాపు 13 కోట్లమంది ఉద్యోగాలకు గండంగా దాపురించింది. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్), పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) లెక్కల ఆధారంగా అంత మంది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదంలో పడ్డాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ డేటా ఆధారంగా జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్ యూ) సెంటర్ ఫర్ ఇన్ఫారల్ సెక్టర్ అండ్ లేబర్ స్టడీస్ ప్రొఫెసర్, హ్యూమన్ డెవలప్మెంట్ ఎకనామిస్ట్ సంతోష్ మెహ్రోత్రా, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్ స్టడీస్ ప్రొఫెసర్ జజతీ కె. పరీదాలు కలిసి ‘ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్: రైజింగ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అండ్ ఫాలింగ్ నాన్ అగ్రికల్చరల్ జాబ్ గ్రోత్’ అనే పేపర్ను పబ్లిష్ చేశారు.

దేశమంతటా 49.5 కోట్లమంది ఉద్యోగులున్నారని అందులో పేర్కొన్నారు. 2017-18లో 3 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయనుకున్నా 46.5 కోట్ల మంది ఎంప్లాయీస్ ఉన్నారంటున్నారు. అందులో జాబ్ సెక్యూరిటీ, ఎలాంటి సోషల్సెక్యూరిటీ లేని అసంఘటిత కార్మికుల ఉద్యోగాలకే ముప్పుందని హెచ్చరించారు. వ్యవసాయం కలుపుకుని 90.7 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయాన్ని పక్కనపెడితే వివిధ రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికుల సంఖ్య 83.5 శాతమంటున్నారు. వ్యవసాయంలో ఉపాధి పొందుతున్నోళ్లు 20.5 కోట్లు కాగా, మిగతా ఉద్యోగులు 26 కోట్లమంది. అందులో 21.7 కోట్లమంది మాన్యుఫాక్చరింగ్, నాన్మాన్యుఫాక్చరింగ్ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులే. ఎలాంటి రాతపూర్వక కాంట్రాక్ట్లేని 13.6 కోట్లమంది ఉపాధికి ముప్పు పొంచి ఉందని ఆ పేపర్లో పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే వాళ్లను కంపెనీలు ఉద్యోగం నుంచి తీసేసే అవకాశాలున్నాయంటున్నారు.

టూరిజంకు గండమే సునీల్ గుప్తా.. ట్రావెల్ బ్యూరో అనే ఓ టూరిజం కంపెనీకి ఓనర్. దేశంలోని పెద్దటూరిజం కంపెనీల్లో ఇదీ ఒకటి. ఆగ్రాలోని ఫతేబాద్లో ఆఫీస్.

లాక్ డౌన్ ప్రకటించడానికన్నా ముందు ఆయన ఆఫీస్ బిజీబిజీగా ఉండేది. 80 కార్లు, 36 కోచెస్తో బిజినెస్ మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆకు రాలిపోయిన చెట్టులా తయారైంది పరిస్థితి. టూరిస్టులు లేరు.

బిజినెస్ లేదు. 145 మంది ఎంప్లాయీస్ ఇంటికే పరిమితమయ్యారు. ఆయన ఒక్కడే ఆఫీసులో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇది ఏ ఒక్క నెలతోనే ఆగిపోదంటున్నారాయన.

సెప్టెంబర్ దాకా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఈ ఆరునెలల పాటు చిల్లిగవ్వ ఆదాయం లేకుండా ఉద్యోగులకు జీతాలివ్వాల్సి ఉంటుందని, తాను ఆ ఖర్చును భరించగలిగినా చిన్న చిన్న ట్రావెల్స్ పరిస్థితేంటని అంటున్నారు. ఆయన మాటలకు బలం చేకూరుస్తూ ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టేస్తున్నాయి. కొన్నైతే అసలు జీతాలివ్వలేమని చేతులెత్తేస్తున్నాయి.

ముఖ్యంగా టూరిస్ట్ గైడ్ లు, డ్రైవర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సగం టూరిజం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాగా నష్టపోయే ప్రమాదముందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ఇప్పటికే హెచ్చరించింది. పరిస్థితులు అక్టోబర్ దాకా ఇలాగే ఉంటే ఈ ఒక్క రంగంలోనే దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉందని పేర్కొంది. పెట్టుబడులు తగ్గే ముప్పు చదువు అయిపోయి జాబ్లోకి ఎంటరయ్యే కుర్రకారుకు, అప్పటికే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉండిపోతున్న నిరుద్యోగులకు కలిపి దేశంలో ఏటా కొత్తగా కోటి ఉద్యోగాలను కల్పించాల్సిన అవసరం ఉందిప్పుడు.

కానీ, కరోనా పుణ్యమా అని కోటి ఉద్యోగాల మాట అటుంచితే, అసలు ఉన్న ఉద్యోగాలు ఊడకుండా ఉంటే చాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలోని ఇండస్ట్రీల్లో ఉద్యోగాల పరిస్థితిపై అడెక్కో గ్రూప్ ఇండియా అనే స్టాఫింగ్ (ఉద్యోగాలిప్పించే కన్సల్టెన్సీ ) సంస్థ ఓ మ్యాప్ను తయారు చేసింది. బట్టల పరిశ్రమ, క్యాపిటల్ గూడ్స్ , సిమెంట్, ఫుడ్, మెటల్స్, ప్లాస్టిక్స్, రబ్బర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని మాన్యుఫాక్చరింగ్ విభాగాల్లో 90 లక్షల జాబ్స్ పోయే ప్రమాదముందని పేర్కొంది. ఇప్పటికే సేల్స్ పడిపోయాయన్న కారణంతో ఆటో మొబైల్ సంస్థల్లో ఉద్యోగుల కోత గురించి ప్రస్తావించింది.

ఈ రంగంలో డీలర్ సిస్టమ్, ఫ్రంట్ లైన్ ఉద్యోగులు, సెమీ స్కిల్డ్ లేబర్కు సంబంధించి 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపింది. విమానయాన రంగంలో 6 లక్షల గ్రౌండ్, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు పోయే ప్రమాదముందని పేర్కొంది. దీని వల్ల సామాజిక సంక్షోభం పెరిగిపోయి రిజర్వేషన్లు పెంచే దిశగా ప్రభుత్వంపై ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చదువు, నైపుణ్యం, ప్రివెంటివ్ హెల్త్ కేర్, మౌలికవసతుల రంగాల్లో పెట్టుబడులు భారీగా తగ్గిపోయే ముప్పు ఉందని జస్ట్ జాబ్స్ నెట్ వర్క్ అనే మేధో సంస్థ ప్రెసిడెంట్ సబీనా దేవన్ అభిప్రాయపడ్డారు.

దాని వల్ల యువత నిరుద్యోగంలో కూరుకుపోతుందని, ఫలితంగా సమాజం అస్తవ్యస్తంగా మారుతుందని, నేరాలు పెరిగిపోయి అస్థిరత ఏర్పడే ముప్పు ఉందని హెచ్చరించారు. చెప్పులు తయారవ్వట్లే ఆగ్రా అనగానే ముందు గుర్తొచ్చేది తాజ్ మహల్. కానీ, దానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే చెప్పుల పరిశ్రమ.

15వ శతాబ్దం నుంచి అక్కడ చెప్పుల పరిశ్రమకు మంచి పేరుంది. ఆగ్రా ఫుట్ వేర్ మాన్యుఫాక్చరర్స్ అండ్ ఎక్స్ పోర్టర్స్ చాంబర్ ప్రకారం అక్కడ దాదాపు 250 ఫ్యాక్టరీలు, 5 వేల కాటేజ్ ఇండస్ట్రీలున్నాయి. రోజూ 5 లక్షల జతల చెప్పులు అక్కడ తయారవుతుంటాయి. 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

అందులో సగం మంది రోజుకూలీలే. కానీ, లాక్డౌన్ పరిస్థితులతో చెప్పుల ఉత్పత్తికి , అమ్మకాలకు డిమాండ్ పడి పోయింది. ఎగుమతులు ఆగిపోయాయి. రెండు నెలల్లో రూ.450 కోట్ల విలువైన ఎక్స్పోర్ట్ ఆర్డర్లు రద్దయ్యాయి.

అందులో ఎక్కువ ఆర్డర్లు యూరోపియన్ బ్రాండ్ల నుంచి వచ్చినవే. అయితే, అక్కడి పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు ఆర్డర్లు రద్దుచేశాయని చంద్రశేఖర్ అనే ఓ ఎక్స్ పోర్టర్ చెప్పారు. దేశమంతా చెప్పుల తయారీ పరిశ్రమది అదే పరిస్థితి. చాలా మంది ఉద్యోగాలు ముప్పులో పడ్డాయి.

ఈవెంట్ కళ తప్పింది ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కు మస్త్ డిమాండ్ ఉంటోంది. కానీ, కరోనా ఎఫెక్ట్ దానిపైనా పడింది. ఈవెంట్లు పెద్దగా జరగట్లేదు. ఉన్నఈవెంట్లు రద్దయి పోయాయి.

ఒక్క ఫిబ్రవరిలోనే రూ.15 కోట్లు నష్ట పోయామని టీమ్ వర్క్స్ ఆర్ట్ అనే ప్రొడక్షన్ కంపెనీ చెబుతోంది. జైపూర్లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ కు ఆ కంపెనీనే ఈవెంట్ ఆర్గనైజర్. కరోనా ఎఫెక్ట్ తో ఇండియా సహా హాంకాంగ్, సింగపూర్, టర్కీ, మొరాకోల్లో ఒప్పుకున్న ఫెస్టివల్స్ ఒప్పందాలు క్యాన్సిల్ అయిపోయాయి. మొత్తం ఇండస్ట్రీపైనా పెద్ద ప్రభావాన్నేచూపిస్తుందని, వచ్చేరెండు నెలల్లోరూ.40 వేల కోట్లనష్టాలు చూడాల్సిన పరిస్థితి ఉంటుందని కంపెనీ ఎండీ సంజోయ్ రాయ్ చెబుతున్నారు.

లైటింగ్ పీపుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, టెంట్లు వేసేటోళ్లు, పూల వ్యాపారులు కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మంది ఇండస్ట్రీలో ఉపాధి పొందుతున్నారని, కరోనా ఎఫెక్ట్ తో 80 శాతం మంది ఉపాధిపై దెబ్బ పడుతుందని ఆయన అన్నారు. పూలు వాడుతున్నయ్ ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రపంచంలో పూల మార్కెట్ కు పెట్టింది పేరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ పూలు కొనుక్కెళ్తుంటారు. పెళ్ళలకు, హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ప్రభుత్వ ఆఫీసులు, చిన్న చిన్న పూల వ్యాపారులు అక్కడే ఆర్డర్లు ఇస్తుంటారు.

కాలం మంచిగుంటే వ్యాపారం మూడు పువ్వులుగా సాగేది. కానీ, ఇప్పుడు ఆ పూల మార్కెట్ వాడిపోయింది. అక్కడ చాలా మంది రోజువారీ కూలీలే. ”నా దగ్గర ఐదుగురు పనిచేస్తున్నారు.

రోజూ నేను రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వ్యాపారం చేసేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జీతాలు చెల్లించే స్తోమత కూడా లేదు” అని సంజయ్ అగర్వాల్ అనే ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం పెళ్ళ్లిలు జరిగే పరిస్థితి కూడా లేకపోవడంతో బిజినెస్ పై పెద్ద ఎఫెక్టే పడిందన్నారు.

కుట్టిన బట్టలు కుప్పపడుతున్నయ్ తిరుప్పూర్.. తమిళనాడులో బట్టల కంపెనీలకు పెట్టింది పేరు. 1,500 ఎక్స్ పోర్టు కంపెనీలున్నాయక్కడ. వేలాది చిన్నచిన్న బట్టల పరిశ్రమలున్నాయి.

ఆరు లక్షల మంది ఈ కంపెనీల మీద ఆధారపడి బతుకుతున్నారు. రోజూ రూ.450 దాకా సంపాదించి కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. కానీ, ఇప్పుడు వాళ్లపరిస్థితి గందరగోళంలో పడింది. రాజా ఎం.

షణ్ముగమ్.. తొలి తరంపారిశ్రామికవేత్త. 1992లో ఆయన అక్కడ ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీ పెట్టారు. జర్మనీ, డచ్ కంపెనీలకు బట్టలు, ముఖ్యంగా టీ షర్ట్లు కుట్టి ఎక్స్ పోర్ట్ చేస్తుంటారు.

కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కరోనా ఎఫెక్తో యూరప్ మార్కెట్లన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈ ఎఫెక్ట్ ఆయన పంపించిన స్టాక్స్ పై భారీగానే పడింది. ఇప్పటికే పంపిన స్టాక్స్ అన్నీ సముద్రం మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి.

ఇప్పటికే ఆర్డరిచ్చిన బుకింగ్స్ హోల్డ్లోకి వెళ్లి పోయాయి. మొత్తంగా తనకు 30 కోట్ల నష్టం వచ్చిందంటున్నారు షణ్ముగమ్. షిప్ మెంట్ అయిన వాటికీ 10 కోట్లమేర చెల్లింపులు ఆగిపోయాయన్నారు. మొత్తంగా సిటీలోని అన్ని కంపెనీలు కలుపుకుంటే జనవరి, ఫిబ్రవరిల్లో షిప్మెంట్ అయిపోయిన స్టాకుకు సంబంధించి రూ.

5 వేల కోట్లమేర చెల్లింపులు ఆగిపోయాయి. రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్స్ హోల్డ్ లో పడిపోయాయి. దేశం మొత్తం బట్టల పరిశ్రమది ఇదే బాధ. దేశ వ్యాప్తంగా 1.8 కోట్లమంది ఆ రంగంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో వాళ్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.

రిటైల్ వ్యాపారం లేదు సేవల రంగంలో మొత్తం 14.4 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో ముఖ్యమైంది రిటైల్ వ్యాపారం. దాదాపు 3.7 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వాళ్లందరి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యేకించి బట్టలు, చెప్పుల దుకాణాల వంటి నాన్ఎసెన్షియల్ సెగ్మెంట్లపై ఎఫెక్ట్ ఎక్కువ పడింది. మాల్స్, స్టోర్లు ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. దీంతో వాటిలో పనిచేస్తున్నవాళ్ల ఉపాధిపైనా దెబ్బ పడింది. బిజినెస్ లేకపోవడంతో పరిస్థితులు చక్కబడేవరకు రెంటును మాఫీ చేయాల్సిందిగా షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్లను.. మాల్స్, స్టోర్ల ఓనర్లు కోరుతున్నారు. వాళ్లే కాదు మాన్యుఫాక్చరింగ్లోని 5.64 కోట్ల మంది, నిర్మాణ రంగం, మైనింగ్, కరెంట్, వాటర్, గ్యాస్ వంటి నాన్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో పనిచేసే 5.9 కోట్లమంది పైనా పెను ప్రభావం తప్పదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *