లంచ్ బ్రేక్‌కి సఫారీలు 136/6.. ఇంకా 465

Spread the love

పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు వెనకబడి ఉంది.

  • శనివారం తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు చేజార్చుకున్న సఫారీలు
  • దూకుడుగా ఆడే ప్రయత్నంలో అశ్విన్‌కి వికెట్ సమర్పించుకున్న డికాక్
  • హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడుతున్న కెప్టెన్ డుప్లెసిస్
  • ఈరోజు తలో వికెట్ పడగొట్టిన ఉమేశ్, షమీ, అశ్విన్

భారత్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడబడుతోంది. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఓవర్‌ నైట్ స్కోరు 36/3తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సఫారీలు లంచ్ విరామానికి 136/6తో నిలిచారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్ (52 బ్యాటింగ్: 76 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. ముత్తుసామి (6 బ్యాటింగ్: 12 బంతుల్లో) సహకారం అందిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌ని భారత్ జట్టు 601/5తో డిక్లేర్ చేయడంతో.. సఫారీలు ఇంకా 465 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉన్నారు.
ఈరోజు ఓవర్‌ నైట్ వ్యక్తిగత స్కోరు 2 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగించిన నోర్జ్ (3) మూడో ఓవర్‌లోనే షమీ బౌలింగ్‌లో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. అయితే.. 20 పరుగులతో రోజుని కొనసాగించిన డిబ్రయిన్ (30: 58 బంతుల్లో 6×4) మాత్రం కాస్త పోరాడాడు. కానీ.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కీపర్ సహాకి క్యాచ్ ఇచ్చి అతనూ పెవిలియన్ చేరిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డికాక్ (31: 48 బంతుల్లో 7×4)తో కలిసి కెప్టెన్ డుప్లెసిస్ దాదాపు 16 ఓవర్ల పాటు భారత్‌కి వికెట్ దక్కకుండా అడ్డుపడ్డాడు. అయితే.. జట్టు స్కోరు 128 వద్ద డికాక్‌ని అశ్విన్ బోల్తా కొట్టించేయడంతో.. సఫారీలు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయారు.

వైజాగ్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు 203 పరుగుల తేడాతో గెలుపొందగా.. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్, డికాక్ సెంచరీలు బాదడంతో గట్టి పోటీనిచ్చిన సఫారీలు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయారు. కానీ.. తాజాగా పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లు చేతులెత్తేస్తుండటంతో.. భారత్‌కి రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాదేమో..? అనిపిస్తోంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *