సౌకర్యం కోసం వాడే ఆ గృహోపకరణం ఒక కుటుంబాన్ని స్వర్గానికి పంపేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో లక్నో లో గతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 👉ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది నిద్రిస్తున్న సమయంలో శాశ్వతంగా కన్నుమూశారు. మృతిచెందిన వారిలో ఆరు నెలల పసికందు కూడా ఉన్నాడు. ఓ ఇంట్లో వీరంతా నిద్రిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన లక్నోలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
🔅సంఘటన :
సుమిత్ సింగ్, అతని భార్య జూలీ, సోదరి వందన, మేనల్లుడు దబ్లు, ఆరునెలల పాప ఓ ఇంట్లో నిద్రిస్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీలో షాట్ సర్క్యూట్ జరిగినట్లు సమాచారం. దీంతో మంటలు చెలరేగి వెంటనే మరో గదికి వ్యాపించాయి. ఆ గదిలో ఎల్పీజీ స్టవ్‌లు ఉన్నాయి. ఈ గదిని ఒక గోదాములాగా వినియోగిస్తున్నారు. ఆ ఇంటి యజమాని టీఎన్ సింగ్ లేకపోవడంతో వీరంతా అక్కడ నిద్రిద్దామని వెళ్లారు. ఏసీ వేసుకుని నిద్రిస్తుండగా షాట్ సర్క్యూట్ జరిగింది.మంటలు గదికి మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు రెండు గదులను కమ్మేశాయి. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడి ఐదుగురు మృతి చెంది ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇంటిలో నుంచి దట్టమైన పొగను గమనించిన స్థానికులు ఫైర్ ఆఫీస్‌కు తెల్లవారుజామున సమాచారం అందించారు. మంటల నుంచి కార్బన్ మొనాక్సైడ్ విడుదల కావడంతో వారు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. అందుకే బయటకు రాలేకపోయారని ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్పారు.ఇంటి వెనక గోడను పగలగొట్టి ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఐదుగంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాక లోపలికి వెళ్లగా అక్కడే ఈ ఐదుగురు విగతజీవులుగా పడిఉన్నారు. మృత్యువు ఎప్పుడు ఎవర్ని ఎలా కబలిస్తుందో..ఎవరికీ తెలియదు.