ముకేశ్ అంబానీ యూటర్న్ తీసుకున్నారు. జియోతో ఉచిత కాల్స్ అందిస్తామని ఊదరగొడుతూ వచ్చిన ఈయన ఇప్పుడు ప్లేటు తిప్పేశారు. దీంతో జియో యూజర్లకు బాదుడు తప్పేలా లేదు.
రిలయన్స్ జియో నుంచి ఉచిత కాల్స్ చేసుకోలేరు
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెంబర్లకు కాల్ చేయాలంటే నిమిషానికి చార్జీలు పడతాయి
దీంతో 35 కోట్ల మంది కస్టమర్లపై ప్రభావం
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మానస పుత్రికగా చెప్పుకునే రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. వాయిస్ కాల్స్‌కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలకు కాల్ చేస్తే ఇప్పుడు చార్జీలు చెల్లించాల్సిందే.
ఇకపోతే అన్ని వాయిస్ కాల్స్ ఉచితమంటూ ఉదరగొడుతున్న రిలయన్స్ జియో బుధవారం చార్జీల కబురు కస్టమర్లకు చేరవేసింది. నిమిషానికి 6 పైసలు చార్జీ వసూలు చేస్తామని పేర్కొంది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా 6 పైసలు వసూలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. జియో కస్టమర్ల నుంచి వసూలు చేసే ఐయూసీ చార్జీలను ఇతర టెలికం కంపెనీలకు చెల్లిస్తుంది.
అయితే 6 పైసలు చార్జీలకు గానూ కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరినట్లు భావించొద్దని తెలిపింది. జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్‌కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి చార్జీలు ఉండదు. ఇవి ఉచితమే.
జియో కస్టమర్లు ఎయిర్టెల్ లేదా వొడాఫోన్ ఐడియా నెంబర్లక కాల్ చేయాలంటే అదనపు టాపప్ వోచర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధర రూ.10, రూ.20, రూ.50, రూ.100గా ఉంది. దీంతో 35 కోట్ల మంది జియో యూజర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.