ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించడం విశేషం.
శతాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం కీలకమైన తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించడం విశేషం. తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని. యాజమాన్య హక్కులనేవి నిర్ధేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు.
ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవని తెలిపారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందన్నారు.
యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని, న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ స్పష్టంచేశారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డ్ వ్యాజ్యం దాఖలు చేసిందని, మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు నిరూపించలేకపోయిందని పేర్కొన్నారు.
శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని వ్యాఖ్యానించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో ఇచ్చిన అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. వివాదాస్పద భూమి మొత్తం రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు కేటాయించింది. అయోధ్యలో ముస్లింలకు ఐదు ఎకరాల భూమి కేటాయించాలని యూపీ, కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది
పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సీజేఐ వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని వివరించారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని సీజేఐ పేర్కొన్నారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.