వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి క్రైస్తవుడన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఆయన పక్కా క్రైస్తవుడు. రోజూ బైబిల్ చదువుతాడు. ఈస్టర్ రోజుల్లో నెల రోజులూ దీక్షలో వుంటాడు. అయితే.. తాను క్రైస్తవుడిని అయినంత మాత్రాన ఇతర దేవుళ్లను ఆచారాలను ఆయన తప్పుబట్టలేదు. అంతే కాదు.. తనను నమ్మిన వాళ్లు ఎవరైనా తన కోసం పూజలు పునస్కారాలు చేయించినా.. ఏమైనా చేయమని చెప్పినా.. వాటిని పాటించాడు వైఎస్.
దీని గురించి వైఎస్ సన్నిహితుడైన ఉండవల్లి ఓ ఇంట్రస్టింగ్ కథను తన పుస్తకంలో రాశారు. వైయస్ క్రైస్తవుడే కానీ, ఆయన అనుచరుల్లో, బంధువుల్లో అధికాంశం మంది హిందువులే కాబట్టి ప్రతీదానికీ ముహూర్తాలూ అవీ పెట్టి పంపించేవారట. అమలాపురంలో రామజోగేశ్వరరావు అనే జ్యోతిష్య పండితుడిపై వైఎస్‌కు గురి కుదిరిందట.
వైఎస్ కార్యక్రమాలకు సంబంధించిన ముహూర్తాలన్నీ సదరు రామజోగేశ్వరరావు చూసుకునేవారట. పాదయాత్రకి, ఎన్నికల ప్రచారం ప్రారంభానికి, పదవీ స్వీకారానికి.. తనకు వచ్చిన ముహూర్తాల లిస్టు రాజమండ్రిలో వున్న ఉండవల్లికి పంపి, మేస్టారికి చూపించి ఏదో ఒకటి ఫిక్స్ చేయమను అనే వారట వైయస్.
అయితే ఓసారి వైయస్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఓ రోజు మేస్టారు ఉండవల్లికి ఫోన్ చేసి ‘వైయస్ జాతకం కొంచెం ఒడిదుడుకుల్లో వుంది. శాంతి జరిపిద్దామన్నారట. ఆయనకు చెప్పకుండానే చేయవచ్చు కానీ దీనికి ఆయన నుంచి అక్షింతలు రావాలి అన్నారట. ఆయన పొద్దుటే స్నానం చేసి, యిష్టదైవాన్ని స్మరించుకుంటూ బియ్యం, పసుపూ కలిపి అక్షింతలు తయారుచేసి కొత్త గుడ్డలో కట్టి మీకు యిస్తే మీరు ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లన్నమాట. అది తీసుకుని మీరు నా దగ్గరకి వస్తే యిక్కడ అమలాపురంలో శాంతి చేయించాలి అన్నారట.
ఆ విషయం వైఎస్‌కు ఉండవల్లి చెబితే.. వైయస్ ‘నువ్విదంతా నమ్ముతావా? అని నవ్వేశారట. కానీ మర్నాడు ఆ అక్షింతలు తయారు చేసి ఇచ్చారట. అప్పుడు ఉండవల్లి.. మీరు అవేళ అక్షింతలు నమ్మకంతో పంపించారా? లేక నేను ఫీలవుతానని మనస్సు మార్చుకున్నారా? అని అడిగారట. అప్పుడు వైఎస్.. మీ మేస్టారు బాగా చదువుకున్న కాలేజీ లెక్చరరు. నువ్వు సరే మేధావివని పేరు తెచ్చుకున్నావు. మీరు నా క్షేమం కోసం ఇంతగా శ్రద్ధ తీసుకుంటే.. ఇంకా నా నమ్మకాల గొడవెందుకయ్యా.. మీరు నమ్మితే నేను నమ్మినట్లే! అన్నారట. అదీ వైఎస్ అక్షింతల సంగతి.