తమిళనాడులో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన చిన్నారి సుజిత్ కన్నుమూశాడు. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు చేసినా బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయలేకపోయారు. చిన్నారి చనిపోయినట్లు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అధికారులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని వేకువజామున బోరు బావి నుంచి వెలికి తీశారు. పసివాడి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
తమిళనాడులోని తిరుచ్చిలో రెండేళ్ల బాలుడు సుజిత్.. ఈ నెల 25న బోరుబావిలో పడ్డాడు. చిన్నారి ముందు 35 అడుగుల్లో చిక్కుకుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పసివాడిని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో.. బాలుడు దురదృష్టవశాత్తూ జారిపోయి 90 అడుగుల లోతులో పడిపోయాడు. దీంతో బయటకు తీయడం కష్టతరంగా మారింది. బాలుడ్ని వెలికి తీసేందుకు భారీ యంత్రాలను రంగంలోకి దించారు. నాలుగు రోజులుగా ప్రయత్నాలను కొనసాగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా బాలుడి క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటు సుజిత్ క్షేమంగా బయటకు రావాలని తమిళనాడుతో పాటూ యావత్ దేశం ఆకాంక్షించింది. సోమవారం రాత్రి సమయంలో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు. అర్థరాత్రి తర్వాత బాలుడు చనిపోయినట్లు గుర్తించారు. బోరు బావిలో నుంచి కుళ్లిన వాసన రావడంతో మళ్లీ వైద్యుల్ని పిలిచి పరిశీలించారు.
కొద్దిసేపటికి సుజిత్ విల్సన్ చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. ఈ విషయాన్ని అధికారులు కూడా ప్రకటించారు. వేకువజాము సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. మనప్పారై ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టమ్ నిర్వహించి.. తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నబిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు శోక సంద్రం మునిగిపోయారు.