అంతటా ఏ2ఏ వైరస్‌

Spread the love

*అంతటా ఏ2ఏ వైరస్‌* *తెలంగాణలోనూ ఇదే*

*నెలల వ్యవధిలో మార్పు* *అంతకుముందు ఏ3ఐ*

*విశ్లేషించిన సీసీఎంబీ*

*వైరస్‌ జన్యుక్రమ విశ్లేషణలో కీలక పురోగతి*

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్‌లో ప్రత్యేకమైన వైరస్‌ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా.. రెండు నెలలు తిరిగే సరికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్‌ సమూహమే మనదేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెయ్యికిపైగా వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొన్న తర్వాత ఈ అంచనాకు వచ్చారు.

సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన బయో ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ పరిశోధన ఫలితాలను విశ్లేషించింది. కొవిడ్‌-19 వైరస్‌ రూపాంతరం చెందుతున్న తీరును తెలుసుకుంటే దానిప్రకారం ఔషధాలు, టీకాలు కనుగొనేందుకు వీలవుతుంది. అందుకే 3 నెలలుగా వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. మార్చిలో రెండు జన్యుక్రమాలను(జీనోమ్స్‌) కనుగొనడంతో మొదలైన పరిశోధన ప్రస్తుతం 1,031కి చేరింది. తెలంగాణ నుంచి 193 జీనోమ్స్‌ ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 178 జీనోమ్స్‌ను హైదరాబాద్‌లో సీసీఎంబీ కనుగొంది. తెలంగాణలోని మిగతా జన్యుక్రమాలను సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ (సీడీఎఫ్‌డీ), గాంధీ ఆసుపత్రిలో కనుగొన్నారు. దేశవ్యాప్తంగా 33 ప్రయోగశాలల్లో ఈ పరిశోధనలు చేపట్టారు.

*60 శాతంపైగా..*

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 11 రకాల వైరస్‌ సమూహాలు వ్యాప్తి చెందుతున్నట్లు ఇదివరకే పరిశోధకులు గుర్తించారు. మనదేశంలో ప్రధానంగా రెండు రకాల సమూహాల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తాజా ఫలితాల ఆధారంగా వెల్లడైంది. 1,031 జీనోమ్స్‌ విశ్లేషణతో అత్యధికంగా ఏ2ఏ సమూహం ఉన్నట్లు గుర్తించారు. యూరప్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ రకం వ్యాప్తే 60 శాతం వరకు ఉందని పరిశోధకులు అంటున్నారు. ఏ2ఏ వైరస్‌ సమూహం తర్వాత ఎక్కువగా మనదేశంలో ఏ3ఐ ఉంది. బీ4 రకం కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏయే వైరస్‌లు ఉన్నాయో తెలుసుకోగా వాటిల్లో దేని తీవ్రత ఏమిటీ అనేది ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. *ఇలా మారుతూ…* * మార్చి నెలలో ఏ2ఏ, ఏ3, ఏ3ఐ, బీ1, బీ4, ఏ1ఏ రకాల సమూహాల వ్యాప్తి ఉన్నా ఎక్కువగా ఏ3ఐ రకం ఉన్నట్టు గుర్తించారు.

* ఏప్రిల్‌ మూడోవారం వరకు ఎక్కువగా అదే ఉండగా నాలుగోవారం నుంచి ఏ2ఏ రకం వ్యాప్తి పెరిగింది. * మే నెల ఒకటి, రెండు వారాల్లోనూ ఏ2ఏ ఎక్కువగా ఉంది. ఏ3ఐ, బీ4, ఏ2 రకాలూ కనిపించాయి.

* మే మూడోవారం నుంచి జూన్‌ రెండోవారం వరకు ఏ2ఏ తప్ప ఇతర రకాల ఉనికి పెద్దగా లేదని పరిశోధకులు విశ్లేషించారు. *తెలంగాణలో రెండే రకాలు.

.* రాష్ట్రంలోనూ రెండు రకాల వైరస్‌ సమూహాల వ్యాప్తే ఎక్కువగా ఉంది.మొదట్లో పూర్తిగా ఏ3ఐ రకం ఉండగా ఇప్పుడు పూర్తిగా ఏ2ఏ ఉన్నట్లు తేలింది. * మార్చి మూడోవారం నుంచి ఏప్రిల్‌ మూడోవారం వరకు దాదాపుగా ఏ3ఐ రకం ఉంది. ఏ2ఏ రెండు జీనోమ్స్‌లో మాత్రమే గుర్తించారు.

* మే రెండోవారం నుంచి జూన్‌ రెండోవారం వరకు ఏ2ఏ రకం తప్ప వేరే వైరస్‌ వ్యాప్తి ఇక్కడ లేదని పరిశోధకులు గుర్తించారు. *రూపాంతరం చెందుతూ..*

వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే క్రమంలో రూపాంతరం చెందుతూ వస్తోంది. 1,031 జీనోమ్స్‌లో 1,514 రూపాంతరాలు జరిగినట్లు సీసీఎంబీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. కొన్నింటిల్లో ఒకేవిధంగా ఉండగా.. మరికొన్నింటిలో రెండు మూడు రూపాంతరాలు ఉన్నాయని విశ్లేషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *