కొద్దికాలంగా ఓ ఫేస్బుక్ ఫ్రెండ్‌తో ఛాటింగ్ చేస్తున్న అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఓకే చెప్పేసింది. దీంతో పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాకు చెందిన సివిల్ లైన్ కొత్వాలి ప్రాంతంలోని మోహన్పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేవాడు. ఫేస్బుక్లో అతడికి వేల సంఖ్యలో ఫ్రెండ్స్ ఉన్నారు. కొద్దికాలంగా ఓ ఫేస్బుక్ ఫ్రెండ్‌తో ఛాటింగ్ చేస్తున్న అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఓకే చెప్పేసింది. దీంతో పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొత్త కోడలు అత్తింట్లో అన్ని పనులు చక్కబెడుతూ అందరి మెప్పు పొందడంతో తాను ఎంతో లక్కీ అయిన ఆ యువకుడు మురిసిపోయాడు.
రెండ్రోజుల క్రితం ఇంట్లోని వ్యక్తులెవరూ మధ్యాహ్నం అయినా బయటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఏడుగురు కుటుంబసభ్యులు అపస్మాకర స్థితిలో ఉన్నారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. వారంతా తేరుకున్న తర్వాత కొత్త కోడలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి ఇంటిని తనిఖీ చేయగా ఆమె బండారం బయటపడింది. బీరువాలో ఉండే బంగారు ఆభరణాలు, నగదు, విలువైన పట్టుచీరలు. మొబైల్ ఫోన్స్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. కొత్త కోడలే తమకు మత్తు మందిచ్చి సొమ్మంతా దోచుకుపోయినట్లు తెలుసుకుని తలలు పట్టుకున్నారు. ఆ మహిళ పక్కా పథకం ప్రకారమే యువకుడిని ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుని చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. సోషల్‌మీడియాలో పరిచయమయ్యారు కదా అని వారి గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత ఏడుపే మిగులుతుందని ఈ ఘటన నిరూపించింది.