*కేరళలో ఘోర విమాన ప్రమాదం..19కి చేరిన మృతుల సంఖ్య*
*35 ఫీట్ల లోయలో పడి విమానం రెండు ముక్కలు*
*100 మందికిపైగా గాయాలు.. ఆస్పత్రికి తరలింపు*
*కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ఘటన*
*దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా ఫ్లైట్*
జోరు వానలో..రన్ వే కనిపించక.. ఎయిరిండియా ఫ్లైట్ దుబాయ్ నుంచి కోజికోడ్ ఎయిర్ పోర్టుకు శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చేరుకుంది. ఎయిర్ పోర్టు ప్రాంతంలో పలుమార్లు చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ కు రెండుసార్లు ప్రయత్నించింది. భారీ వర్షం కారణంగా ల్యాండ్ అయ్యే సమయంలో చీకట్లో విజబులిటీ లేక రన్ వే పై నుంచి స్కిడ్ అయింది. రన్ వే చివరి వరకు వెళ్లిన విమానం.. పక్కనే ఉన్న 35 అడుగుల లోయలో పడిపోయింది. ఆ టైమ్లోనే రెండు ముక్కలైపోయింది.
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వే పై నుంచి స్కిడ్ అయిన విమానం.. 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది.
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 1344 (బోయింగ్ 737 విమానం) దుబాయ్ నుంచి వస్తోంది. అది కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే పై నుంచి స్కిడ్ అయి, లోయలో పడిపోయింది.
శుక్రవారం రాత్రి 7:40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించగా..
మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైలెట్లలో ఒకరైన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ మరణించారని ఆఫీసర్లు చెప్పారు.
112 మంది గాయపడ్డారని, వారందరినీ ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఫ్లైట్ లో మొత్తం 190 మంది ఉన్నారు. వారిలో 10 మంది పిల్లలు, నలుగురు క్యాబిన్ సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నారని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫ్లైట్ వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ లోని మనోళ్లను తీసుకొస్తోందని చెప్పింది. విమానం రన్ వే 10పై ల్యాండ్ అయిందని, రన్ వే చివరి వరకూ వెళ్లి ఫ్లైట్..
పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని డీజీసీఏ తెలిపింది. ఆ టైంలో ఎలాంటి మంటలు రాలేదని దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొంది. ల్యాండింగ్ కు రెండుసార్లు ప్రయత్నం..
భారీ వర్షాల వల్లే ఫ్లైట్ రన్ వే పై నుంచి స్లిప్ అయినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ ఎయిర్ పోర్టులో కొన్నిసార్లు చక్కర్లు కొట్టినట్లు, ల్యాండింగ్ కు రెండు సార్లు ప్రయత్నించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ‘‘ఫ్లైట్ రాడార్ 24’’ పేర్కొంది.
కేరళ సీఎంకు ప్రధాని ఫోన్ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా కలచి వేసిందని ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో మాట్లాడి , అక్కడి పరిస్థితిని తెలుసుకున్నానని పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు .
‘‘కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదం బాధించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి” అని ప్రధాని ట్వీట్ చేశారు. స్పాట్ లో అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టారన్నారు. ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
వెంటనే రెస్య్కూ ఆపరేషన్స్ చేపట్టాలని ఎన్డీ ఆర్ఎఫ్ను ఆదేశించినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఫ్లైట్ ఇన్సిడెంట్ పై కేరళ సీఎం పినరయ్ విజయన్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని పోలీస్, ఫైర్ సిబ్బందిని ఆదేశించారు.