ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి బాగానే శ్రమిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పాండ్య విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ప్రపంచ కప్ ముందుండటం వల్ల ఎలాంటి విశ్రాంతి తీసుకోవట్లేదని పోస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాండ్యను ప్రశంసిస్తున్నాడు. టీమిండియా ఆటగాళ్లందరూ విహార యాత్రల్లో ఉంటే పాండ్య మాత్రం ఇలా ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.
ప్రపంచ కప్ మే 30న మొదలు కానుంది. ఇందుకోసం టీమిండియా ఈ నెల 22న ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్తుంది. ఇందుకోసం ఆటగాళ్లందరూ 21వ తేదీనే ముంబయి చేరుకోవాలని బీసీసీఐ సూచించింది. మెగా టోర్నీలో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనుంది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 5న ఈ మ్యాచ్ జరుగుతుంది.