ఓపెనర్లు శుభారంభం చేసినా చేయకపోయినా… ఛేదనలో మాత్రం కోహ్లి ఆటే కీలకం. అదెన్నోసార్లు రుజువైంది కూడా! మరిపుడు రోహిత్, రాహుల్ చక్కని ఆరంభమే ఇచ్చారు. కోహ్లి కూడా బాగా ఆడాడు. కానీ మిడిలార్డరే తమకు పట్టనట్టుగా చేతులెత్తేసింది. దీంతో ఒకదశలో విజయానికి ఎంతో దూరంలో భారత్ నిలిచింది. ఇలాంటి దశలో విరాట్ కడదాకా ఉండాల్సిందే. కానీ గెలిపించే ఈ నాయకుడు కూడా లక్ష్యానికి 30 పరుగుల దూరంలో అవుటయ్యాడు.
ఈ పరిణామంతో స్టేడియమే కాదు… యావత్ దేశమే షాకయ్యింది. పరాజయం ఖాయమనుకుంది. కానీ జడేజాకు టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు,1 సిక్స్) జతయ్యాడు. ఇద్దరూ గెలిపించే మెరుపులతో అలరించారు. కీలకదశలో స్ఫూర్తిదాయక బ్యాటింగ్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్‌పై భారత్‌కు వరుసగా పదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించారు.
కటక్: విజయవంతమైన సారథి విరాట్ కోహ్లి ఖాతాలో మరో వన్డే సిరీస్ జమ అయింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. నికోలస్ పూరన్ (64 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ పొలార్డ్ (51 బంతుల్లో 74 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగారు. భారత్ తరఫున అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ నవదీప్ సైనీకి 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ కోహ్లి (81 బంతుల్లో 85; 9 ఫోర్లు), రాహుల్ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’… రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి.