*ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్ వాయిదా!*
దిల్లీ: ఐపీఎల్‌కు ముహూర్తం త్వరలోనే ఖరారు కానుందా?
టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో బీసీసీఐ లీగ్ నిర్వహణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబరు ఆఖరులో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను వాయిదా వేయనున్నట్లు సమాచారం! పరిమిత ఓవర్ల సిరీస్ (మూడేసి వన్డేలు, టీ20లు) కోసం సెప్టెంబర్‌లో ఆ జట్టు భారత్‌కు రావాల్సి ఉంది. 16న సిరీస్ షురూ కావాలి. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ అసలు కారణం ఐపీఎల్ అని తెలుస్తోంది.
వచ్చే నెలలో న్యూజిలాండ్- ఎ జట్టుతో స్వదేశంలో జరగాల్సిన మ్యాచ్‌లు కూడా వాయిదా పడనున్నాయి. ఈ సిరీస్‌ల వాయిదాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
‘‘టీమ్ఇండియా భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్టీపీ) గురించి చర్చించడమే ప్రధానాంశంగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం సమావేశం కానుంది. ఎఫ్‌టీపీపై ఓ స్పష్టత వచ్చిన తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చే వీలుంది’’ అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.
*దుబాయిలో శిక్షణ శిబిరం!:*
2020 ఐపీఎల్ నిర్వహణకు వేదికగా యుఏఈని ఖరారు చేస్తే.. భారత కాంట్రాక్టు ఆటగాళ్లకు దుబాయిలో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నిరవధిక వాయిదా పడ్డ ఐపీఎల్ పదమూడో సీజన్‌ను భారత్‌లో నిర్వహించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో విదేశాల్లో లీగ్ నిర్వహణకు బీసీసీఐ మొగ్గుచూపే వీలున్న నేపథ్యంలో యుఏఈలో లీగ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ అదే ఖరారైతే టీమ్ఇండియా ఆటగాళ్లకు దుబాయిలోని ఐసీసీ అకాడమీలో శిబిరం ఏర్పాటు చేసే వీలుంది. అక్కడి నుంచి ఆటగాళ్లు తమ ఐపీఎల్ జట్లతో సులభంగా కలవొచ్చని బీసీసీఐ భావిస్తోంది. అయితే అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ఆరంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఐపీఎల్, శిక్షణ శిబిరం గురించి బీసీసీఐ ప్రకటించనుంది.