మహర్షి..box office ని గెలిచాడా..

Spread the love

మన స్టార్ హీరోలుక‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేస్తున్నారు. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే… ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తున్నారు. అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశాడు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అదే ఫార్మెట్ లో వెళ్లి.. ‘మ‌హర్షి’గా మారాడు. హీరోయిజానికి ఎక్క‌డా లోటు లేకుండా చూసుకుంటూనే ఓ బ‌ర్నింగ్ పాయింట్‌ని ఎంచుకున్నాడు. మ‌రి ఈసారి ఎలాంటి ఫ‌లితం వ‌చ్చింది? మ‌హేష్ న‌మ్మ‌కాన్ని వంశీ పైడిప‌ల్లి ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకున్నాడు?

కథేంటంటే..: రిషి కుమార్ (మ‌హేష్ బాబు) ఓ కంపెనీకి సీఈఓ. ఓడిపోవ‌డం అంటే ఏమిటో తెలియని బిజినెస్మేన్‌. త‌న క‌ష్టాన్నీ, క‌ల‌ల్ని, విజ‌యానికి సోపానాలుగా మ‌ల‌చుకున్న వ్య‌క్తి. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నేప‌థ్యం నుంచి వ‌చ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే త‌న జీవితం, త‌న విజ‌యాలు త‌నొక్క‌డి క‌ష్టానికి వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాలు కాదని, వాటి వెనుక త‌న ఇద్ద‌రి స్నేహితుల (పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌) క‌ష్టం, త్యాగం కూడా ఉన్నాయ‌ని గ్ర‌హిస్తాడు. మ‌రి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు? విజ‌యం అంటే డ‌బ్బు సాధించ‌డ‌మే, స్థాయిని పెంచుకోవ‌డ‌మే అనుకునే రిషి – అస‌లుసిస‌లైన విజ‌యాన్ని ఎలా గుర్తించాడు? మ‌హ‌ర్షిగా ఎలా మారాడు? అనేదే క‌థ‌.

ఎలా ఉందంటే: మ‌హేష్ 25వ సినిమా ఇది. ఓ మైలు రాయి చిత్రానికి ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందో అవ‌న్నీ జోడించి అల్లుకున్న క‌థ‌లా అనిపిస్తుంది. సీఈఓగా రిషిని ప‌రిచ‌యం చేసే స‌న్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఆ వెంట‌నే ఫ్లాష్ బ్యాక్ మొద‌లైపోతుంది. సీఈఓగా, విద్యార్థిగా అప్ప‌టిక‌ప్పుడు త‌న పాత్రలోనే రెండు వేరియేష‌న్స్ చూపించాడు మ‌హేష్‌. కాలేజీ స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతాయి. స్నేహం, ప్రేమ‌లాంటి ఎమోష‌న్స్ పండిస్తూనే విద్యా వ్య‌వ‌స్థ తీరు తెన్నుల‌ను ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేశాడు. కాలేజీ నేప‌థ్యం, ముగ్గురు వ్యక్తుల మ‌ధ్య స్నేహం, విద్యావ్య‌వ‌స్థ‌పై వ్యంగ్య బాణాలు ఇవ‌న్నీ చూస్తే ‘త్రీ ఇడియ‌ట్స్’‌` గుర్తుకురావ‌డం స‌హ‌జం. అయితే ఆ పోలిక‌లు వెతికే అవ‌కాశం ఇవ్వ‌కుండా.. కొత్త‌ద‌నం జోడించుకుంటూ వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు వంశీ పైడిప‌ల్లి. విశ్రాంతికి ముందు స‌న్నివేశాలు మెలోడ్రామా ప్ర‌ధానంగా సాగాయి. ఎమోషన్స్‌ని పండించాయి.

👉Second Half :
అదే జోరు ద్వితీయార్ధంలోనూ క‌నిపిస్తుంది. తొలి స‌గంలో విద్యావ్య‌వ‌స్థ‌ని ప్ర‌శ్నించిన రిషి – ద్వితీయార్ధంలో రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాడు. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతుల దీన‌స్థితిని క‌ళ్ల‌కు క‌ట్టారు. రిషి ల‌క్ష్యం, ఆశ‌య సాధ‌న‌కు ఎంచుకున్న మార్గం… ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఇలాంటి పాయింట్ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం అభినందించ‌ద‌గిన విష‌యం. కాక‌పోతే.. కేవ‌లం ఒకే అంశంతో ద్వితీయార్ధం మొత్తం న‌డిపించ‌డం కాస్త సాగదీతగా కనిపిస్తుంది. ఇంచుమించుగా మూడు గంట‌ల నిడివి ఉన్న సినిమా ఇది. స‌న్నివేశాల్ని కుదించుకునే వీలున్నా.. ఆ దిశ‌గా చిత్ర‌బృందం ఆలోచించ‌లేదు. ఈ క‌థ‌కు కీల‌కం అనుకున్న మ‌హేష్ – న‌రేష్ ఎపిసోడ్‌లో ఎమోషన్స్‌ ఇంకాస్త బాగా పండాల్సింది. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఎలాంటి మ‌లుపులూ లేకుండా సాగ‌డం, క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉన్నా, ఓ క‌థ‌ని నిజాయ‌తీగా చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం మాత్రం అభినందించ‌దిగిన విష‌య‌మే.
ఎవ‌రెలా చేశారంటే..
🔅మ‌హేష్ బాబు : న‌టుడిగా మ‌హేష్‌కి త‌న‌లోని వైవిధ్యాన్ని చూపించుకునే అవ‌కాశం ద‌క్కింది. త‌న పాత్ర‌లో మూడు షేడ్స్ ఉంటాయి. ఒక్కో షేడ్‌లో ఒక్కోలా క‌నిపిస్తాడు. సీఈఓగా స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్ – విద్యార్థిగా మాస్‌ని అల‌రిస్తాడు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు త‌న‌లోని సిన్సియారిటీ క‌నిపిస్తుంది. మ‌హేష్ తెర‌పై మ‌రింత అందంగా క‌నిపించాడు. త‌న వ‌ర‌కూ అభిమానుల్ని అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.
🔅అల్ల‌రి న‌రేష్‌ :
కథానాయకుడిగా సరైన విజయం అందుకుని చాలా కాలమైన అల్ల‌రి న‌రేష్‌కి ఇందులో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ దక్కింది. క‌థ‌కి మూల‌స్తంభంగా నిలిచాడు. ‘గమ్యం’లో గాలిశీను పాత్రలా ఇది ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇలాంటి పాత్ర‌ల‌కు ఇక‌పై న‌రేష్ పేరుని ప‌రిశీలించ‌డం ఖాయం.
🔅పూజాహెగ్డే :
ఇక కథానాయికగా వరుస సినిమాలను చేస్తున్న పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. ఆమెను కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం చేయ‌లేదు. క‌థానుసారం ఆ పాత్ర‌కూ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్‌ సన్నివేశాల్లో చిలిపితనంతో ఆకట్టుకున్న పూజా పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది. జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి స్టైలిష్ విల‌న్‌గా ఆక‌ట్టుకున్నారు.

🔅దేవిశ్రీసంగీతం : దర్శకుడు దేవిశ్రీ పాట‌లకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్క‌సారి విన‌గానే ఎక్కేయ‌వు. కానీ, నెమ్మదిగా విన‌గా విన‌గా న‌చ్చుతాయి. ‘మహర్షి’ విషయంలోనూ అదే జరిగింది. సినిమాలో ఆ పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా శ్రీమణి సాహిత్యం పాటలకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక నేప‌థ్య సంగీతంలోనూ దేవి త‌న మార్క్‌ను చూపించారు.

సినిమాని స్టైలిష్‌గా, రిచ్‌గా తీర్చిదిద్దారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడికి రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. అందులో మహేష్‌ సినిమా కావడంతో ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న క‌థ బ‌ల‌మైన‌దే. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందుకు మహేష్‌లాంటి అగ్రకథానాయకుడి ఎంచుకోవడం వల్లే ఈ కథకు మరింత బలం చేకూరింది. అయితే, నిడివి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలకు కత్తెరవేస్తే బాగుండేది. సంభాష‌ణ‌లు స‌హ‌జంగా ఉన్నాయి.
👉బ‌లాలు:
+ కథాంశం
+ మ‌హేష్ బాబు
+ నిర్మాణ విలువ‌లు
+ కాలేజీ స‌న్నివేశాలు

👉బ‌ల‌హీన‌త‌లు :
– నిడివి
– క‌థ‌లో మితిమీరిన అంశాలు
చివ‌రిగా… మ‌హ‌ర్షి.. ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌య‌త్నం!..కానీ శ్రీమంతుడు ఫార్ములా అయినా హెవీ డోస్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *