నల్లమల అడవుల్లో కొండగుట్టలమధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతారు. శ్రీశైలంలో పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటిగా చెబుతారు. అయితే ఈ ఆలయానికి దగ్గర్లో దట్టమైన అరణ్య ప్రాంతంలో అధ్బుతమైన అమ్మవారి ఆలయం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఇక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం నుండి శ్రీశైలానికి గల కాలి బాట మార్గంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కమేశ్వరి దేవి ఆలయం ఉంది. అయితే శ్రీశైలం నుండి దోర్నాలమార్గంలో 11 కి.మీ. ప్రయాణించి అక్కడి నుండి ఎడమవైపు నెక్కంటి, పాలుట్ల అటవీమార్గంలో 10 కి.మీ. ప్రయాణిస్తే శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చేరుకోవచ్చు.
ఈ ఆలయం దగ్గర జన సంచారం అనేది ఉండదు. అయితే పూర్వం ఇక్కడ కోయలు నివసించేవారని చెబుతారు. ఇక ఈ ఆలయం సముద్రమట్టానికి 2128 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడినదిగా తెలియుచున్నది.ఈ చిన్న పురాతన దేవాలయం గతంలో ప్రముఖ శక్తిక్షేత్రంగా, సిద్ద క్షేత్రంగా విరాజిల్లింది. ఈ ఆలయంలో చతుర్భుజాలను కలిగి ఉన్న ఇష్టకామేశ్వరి దేవి కొలువై ఉంది. అయితే రెండు చేతులతో కలువ మొగ్గలను, క్రింది కుడి చేతిలో రుద్రాక్ష మాలను, ఎడమచేతిలో శివలింగాన్ని ధరించి ఉన్న ఈ దేవి రుద్రాక్ష మలాలనే కర్ణాభరణాలుగా, కంఠా భరణాలుగా ధరించి ఉంటుంది.ఈ విధంగా కొలువ ఉన్న ఈ అమ్మవారికి ప్రత్యేక దీపారాధన చేసి పొంగలిని నివేదిస్తారు. అయితే కామేశ్వరీదేవికి, ఇష్టకామేశ్వరీదేవికి ఏవిధమైన పోలికలు ఉండవు. ఇద్దరు కూడా వేరు వేరు దేవతలు. ఈ రకమైన ఇష్టకామేశ్వరి దేవి విగ్రహం ఇక్కడ తప్ప భారతదేశంలో మరెక్కడా కూడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక వాగు ఉత్తర వాహానియై ప్రవహిస్తుంది.ఇలా దట్టమైన అరణ్యంలో వెలసిన ఈ అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.