సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, బెదిరింపులకు పాల్పడకుండా నెటిజన్లు సంయమనం పాటించాలని ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌టాటా అభిలషించారు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసిన ఆయన ఆన్‌లైన్‌లో ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో దూషించుకోవడం, బెదిరింపులకు పాల్పడటం మానేయాలని కోరారు. ‘ప్రతీ ఒక్కరికీ ఈ ఏడాది సవాళ్లతో కూడుకున్నదే. ఈ మధ్య ఆన్‌లైన్‌లో నెటిజన్లు ఇతరుల్ని దూషించడం, కించపర్చడం చాలా చూస్తున్నాను. అలా వారి ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదు’ అని టాటా పేర్కొన్నారు.
ఏ విషయంలోనైనా వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇష్టమొచ్చినట్లు కోప్పడుతున్నారని, అలా కాకుండా సంయమనం పాటించాలని చెప్పారు. శాంతంగా ఉండి ఇతరుల పట్ల దయతో వ్యవహరించాలని కోరారు. ఈ ఏడాది మనం కలిసి ఉండేందుకు, ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు ప్రత్యేకంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించే సమయం ఇది కాదని, మర్యాదపూర్వకంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అందర్నీ అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇక ఆన్‌లైన్‌లో తాను ఉండేది కొద్దిసేపే అయినా, ఇక్కడ మంచి వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు కోపతాపాలు, రాగద్వేషాలను పక్కనపెట్టి బాధ్యతాయుతంగా మెలగాలని దిగ్గజ వ్యాపారవేత్త కోరారు.