Teluguwonders:
జూబ్లీ చెక్‌పోస్ట్-హైటెక్ సిటీ రూట్లో అందుబాటులోకి రివర్సల్ సదుపాయం. సిటీ జనానికి మెట్రో మరింత అందుబాటులోకి వచ్చింది.. ఇకపై ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. జూబ్లీ చెక్‌పోస్ట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో మొన్నటి వరకు 8 నిమిషాలకో రైలు నడిపారు. ఇప్పుడు రివర్సల్ సదుపాయం రావడంతో పీక్ అవర్స్‌లో 3 నిమిషాలు, నాన్‌పీక్ అవర్స్‌లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. కాగా మెట్రో సర్వీసులకు గ్రేటర్ సిటీజన్ల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సరాసరిన ప్రతివారం ప్రయాణికుల సంఖ్యలో 5-6 వేల మేర పెరుగుదల నమోదవుతోంది.
బుధవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య 3.06 లక్షలకు చేరుకోవడం విశేషం. ఇక స్టేషన్లలో రద్దీని కలిపితే ప్రయాణికుల సంఖ్య 3.23 లక్షలకు చేరుకున్నట్లు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్ (29 కి.మీ.), నాగోల్-హైటెక్ సిటీ (28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. గురువారం హైటెక్ సిటీ, అమీర్‌పేట్, ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర స్టేషన్లు సైతం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడాయి.
హైటెక్ సిటీ-రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ (1.1 కి.మీ.) మార్గంలో మెట్రో పట్టాలు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, స్టేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరులో ఈ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్ రన్ నిర్వహిస్తామని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.
ఎంజీబీఎస్-జేబీఎస్ (10 కి.మీ.) మార్గంలో ఈ ఏడాది డిసెంబర్‌లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో పనులు, స్టేషన్లు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుదీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. హైటెక్ సిటీ మెట్రోస్టేషన్ బుధవారం 24 వేల మంది ప్రయాణికుల రాకపోకలతో సరికొత్త రికార్డు సృష్టించినట్లు హెచ్‌ఎంఆర్ అధికారులు తెలిపారు.
మెట్రో రైళ్ల మధ్య అంతరం.. 8 నిమిషాలు..
ఇప్పటి వరకు ఇలా.. 3 నిమిషాలు..
ఇకపై పీక్ అవర్‌లో.. 5 నిమిషాలు..నాన్ పీక్ అవర్‌లో..