కంప్యూటర్ ఆపరేటర్ బెదిరింపులు.. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

Spread the love

కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గ్రామ వాలంటీర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాల్లో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తహసీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతోనే ప్రకాశం జిల్లా  యర్రగొండపాలెం పట్టణానికి చెందిన గ్రామ వాలంటీర్ షేక్ జుబేద (20) బలవన్మరణానికి పాల్పడింది. కంప్యూటర్ ఆపరేటర్ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉన్న ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ గుంటూరి శివప్రసాద్‌చారి అవమానకరంగా మాట్లాడటం వల్లే తమ కుమార్తె ఉరేసుకుందని మృతురాలి తల్లి కరీమున్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి తమ ఇంటికి వచ్చిన శివప్రసాద్‌చారి.. రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి ఎంఆర్ఓ ఆఫీసుకు తీసుకురావాలని హెచ్చరించారని వివరించింది. అంతేకాదు, సక్రమంగా పనిచేయడం లేదని, ఇలా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారని కటువుగా మాట్లాడారని తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జుబేద శనివారం ఉదయం బాత్‌రూమ్ పైనున్న ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కరీమున్‌ చెప్పారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం శివప్రసాద్‌చారి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళ దూషించడంతో గ్రామ వాలంటీర్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. గ్రామ వాలంటీర్ పండు నవీన(22) తన గ్రామంలో వివరాలు సేకరిస్తుండగా మంగ అనే మహిళ వచ్చి తన ఆధార్ కార్డు ఎందుకు ఆన్లైన్ చేయడం లేదని ప్రశ్నించింది. అయితే, ఆధార్ కార్డులో సవరణలు తన పరిధిలోకి రావని నవీనా సమాధానం ఇచ్చింది. అయినా కూడా మంగ వినిపించుకోకుండా వాగ్వివాదానికి దిగింది.

ఆపై పరుష పదజాలతో దూషించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయి జరిగిన విషయం తండ్రి శ్రీరామమూర్తికి తెలిపింది. ఆయన వారించి పొలం పనులకు వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన నవీన ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *