కిమ్మనకుండా.. జిమ్‌

Spread the love

*కిమ్మనకుండా.. జిమ్‌!*

*కసరత్తుల సమయంలో అరవొద్దు, నవ్వొద్దు*

*ప్రతి ఒక్కరికీ 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాలి*

*పరికరాల మధ్య 6 అడుగుల ఎడం ఉండాలి*

*యోగా క్రియలు ఆరుబయట మాత్రమే చేయాలి*

*వ్యాయామశాలలు, యోగా కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు*

దిల్లీ: వ్యాయామశాలలు, యోగా కేంద్రాల్లో అరవడం, గట్టిగా నవ్వడం వంటివాటిని పరిహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ వ్యాయామశాలలు, యోగా కేంద్రాలను కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది. వ్యాయామశాలలు, యోగా కేంద్రాల్లో ప్రతి మనిషికీ 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాలని స్పష్టంచేసింది. 65 ఏళ్లు దాటినవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు నాలుగు గోడల మధ్య ఉండే వ్యాయామ, యోగా కేంద్రాలు ఉపయోగించొద్దని సూచించింది. అన్ని కేంద్రాల్లో పల్స్‌ ఆక్సీమీటర్లు ఉంచి, వ్యాయామం ప్రారంభించడానికి ముందే అందరి ఆక్సిజన్‌ స్థాయి నమోదు చేయాలని స్పష్టంచేసింది. నిర్వాహకులు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది.

* యోగా, వ్యాయామం చేసేటప్పుడు సాధ్యమైనంతవరకు ఫేస్‌షీల్డ్‌ పెట్టుకోవాలి. మాస్క్‌ (ప్రత్యేకించి ఎన్‌-95 మాస్క్‌) ఉపయోగిస్తే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వ్యాయామం, యోగా చేయని సమయాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

* ప్రతి కేంద్రంలో ఒక్కో మనిషికి 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాలి. వ్యాయామ పరికరాలు తిరిగేచోటకూడా 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. ఒక్కో మనిషికి 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాల్సి ఉన్నందున దాని ప్రకారం ఒక్కో సెషన్‌కు ఎంతమందిని అనుమతించవచ్చో లెక్కించి ఆమేరకు తరగతుల ప్రణాళిక రూపొందించుకోవాలి. తరగతుల మధ్య కనీసం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం తేడా ఉండేలా చూసుకోవాలి.

* వ్యక్తిగత శిక్షణ ఇచ్చేటప్పుడు ట్రైనర్‌, నేర్చుకొనేవారికి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామశాలలోకి సిబ్బంది, సభ్యులను పరిమిత సంఖ్యలోనే అనుమతించాలి.

* కంటెయిన్‌మెంట్‌ జోన్లలో యోగా, జిమ్‌ సెంటర్లు తెరవకూడదు. ఈ జోన్లలో నివాసం ఉండే శిక్షకులు, అభ్యాసకులు తరగతులకు హాజరవకూడదు.

* ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉండాలి. అందుకు తగ్గ మార్కింగ్‌లు పెట్టాలి. వచ్చి వెళ్లేటప్పుడు క్యూలు పాటించాలి. స్పర్శకు తావులేని డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి.

* ఎయిర్‌ కండీషన్‌కు సంబంధించి ఇదివరకు సీపీడబ్ల్యూడీ జారీచేసిన మార్గదర్శకాలు అనుసరించాలి. ఏసీలు 24-30 డిగ్రీల సెల్సియస్‌లో నిర్వహించాలి. గది లోపల గాలిలో తేమ 40-70% ఉండాలి. సాధ్యమైనంతవరకు సహజమైన గాలి వచ్చిపోయేలా కిటికీలు కొంత మేర తెరిచి ఉంచాలి.

* వీలైతే ఆరుబయట యోగా, వ్యాయామ తరగతులు నిర్వహించాలి.

* యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు శుభ్రంచేసే సిబ్బందికి వ్యర్థాల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలి. ఇందులో పనిచేసే వయోవృద్ధులు, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వారిని జిమ్‌కు వచ్చేవారితో నేరుగా తారసపడే పనుల్లో పెట్టకూడదు.

* ఈ కేంద్రాలకు వచ్చే సందర్శకులు, సభ్యులు, సిబ్బందికి ఫేస్‌ కవర్లు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. వ్యాయామం చేయకముందు, చేసిన తర్వాత పరికరాలు, నేలను శుభ్రం చేయడానికి క్రిమిరహితం చేసే ద్రావణాలు, వాడిపడేసే కాగితపు తువ్వాళ్లు వంటివి అందుబాటులో ఉంచాలి. చెత్తబుట్టలను ఎల్లప్పుడూ మూసి ఉంచాలి.

* ప్రతి ఒక్కరి మధ్య వేలును శానిటైజర్‌తో శుభ్రం చేసి ఆక్సిమీటర్‌ ద్వారా ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించాలి. 95%కంటే తక్కువ ఉన్న వారిని వ్యాయామానికి అనుమతించొద్దు. వ్యాయామం చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తితే వెంటనే ఆక్సిజన్‌ స్థాయి చూడాలి. 95% కంటే తక్కువ ఉన్నవారిని మళ్లీ కసరత్తులు చేయడానికి అనుమతించకూడదు. వెంటనే కాల్‌సెంటర్‌, హెల్ప్‌లైన్‌, ఆంబులెన్స్‌కి ఫోన్‌చేసి అలాంటి వారిని సమీప ఆరోగ్య కేంద్రానికి పంపాలి.

* లక్షణాలు లేనివారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. అదికూడా ఫేస్‌మాస్క్‌ ఉంటేనే. * అన్ని ప్రవేశ ద్వారాల్లో శానిటైజర్‌, థ్మరల్‌ స్క్రీనింగ్‌ సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి.

* పార్కింగ్‌ స్థలాలు, కారిడార్లు, లిఫ్ట్‌ల్లోనూ భౌతికదూరం అమలుచేయాలి.

* చెప్పులు, బూట్లూ బయట వదలాలి. వీలయితే ఒక్కో వ్యక్తి/కుటుంబాల పాదరక్షలు ప్రత్యేక అరల్లో పెట్టాలి.

* వ్యక్తులు వచ్చి పోయే సమయాలు, వారి ఫోన్‌ నెంబర్లు, చిరునామాలను విధిగా నమోదుచేయాలి.

* ప్రతి జిమ్‌ పరికరం దగ్గరా హ్యాండ్‌ శానిటైజర్‌ ఉంచాలి. వాటిని ముట్టుకోబోయే ముందు ప్రతి ఒక్కరూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఉమ్మడి కసరత్తు మ్యాట్లను పరిహరించాలి. ఎవరికి వారు సొంతంగా మ్యాట్లు తెచ్చుకొని, పూర్తయిన తర్వాత వెంట తీసుకెళ్లేలా చూడాలి.

* వైరస్‌ సంక్రమణాన్ని దృష్టిలో ఉంచుకుని గట్టిగా అరవడం, నవ్వడం లాంటి కసరత్తులను పరిహరించాలి.

* మరుగుదొడ్లు, స్నానపు గదులను వాడక ముందు, తర్వాత శుభ్రం చేయాలి.

* వ్యాయామ కేంద్రాన్ని మూసివేసేముందు మొత్తం ప్రాంగణాన్ని క్రిమిరహితం చేయాలి. * అనారోగ్య సమస్య తలెత్తినవారిని ప్రత్యేక గదిలో ఉంచాలి. వైద్యుడు పరిశీలించేంతవరకూ మాస్క్‌ పెట్టుకునేలా చూడాలి. ఒకవేళ సదరు వ్యక్తికి పాజిటివ్‌ వస్తే మొత్తం ప్రాంగణాన్ని క్రిమిరహితం చేయాలి.

* కొంతకాలం వరకు యోగా క్రియలు ఆపేయాలి. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే ఆరుబయటి ప్రాంతాల్లో చేయాలి. యోగాభ్యాసకులు ఆయుష్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలు అనుసరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *