ఏఆర్ రెహమాన్
ముంబయి: బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ అనే తేడా లేదు.. ప్రతి చోట తనదైన సంగీతంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. తన ప్రతిభతో ఆస్కార్ అవార్డులు సైతం గెలుచుకున్న ఏఆర్ రెహమాన్.. బాలీవుడ్లో ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలా మందికి ఉన్న సందేహం. తాజాగా ఆ సందేహానికి ఓ ఎఫ్ఎం రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు రెహమాన్.
”నేనెప్పుడు మంచి సినిమాలకు నో చెప్పలేదు. కానీ బాలీవుడ్లో ఓ గ్యాంగ్ ఉంది.
అపార్థాలతో తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ‘దిల్ బెచారా’ దర్శకుడు ముఖేశ్ చబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు పాటలు ఇచ్చాను. రెహమాన్ వద్దకు వెళ్లొద్దని చాలా మంది చాలా రకాలుగా అతడికి చెప్పారట. అప్పుడే అర్థమైంది.
మంచి సినిమాలు నా వరకు ఎందుకు రావట్లేదో. ఓ గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోందని తెలిసింది. నా నుంచి మరిన్ని పాటలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ కొందరు నన్ను ఆ పని చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.
అయినా ఫర్వాలేదు. నేను విధిని, దేవుణ్ని నమ్ముతా. కాబట్టి నా వద్దకు వచ్చిన సినిమాలు చేస్తూ.. ఇతర పనులు చక్కబెట్టుకుంటున్నా.
అలాగే అందరినీ ఆహ్వానిస్తున్నాను. మంచి సినిమాలతో నా వద్దకు రండి” అని రెహమాన్ తెలిపారు. రెహమాన్ సంగీతం అందించిన ‘దిల్ బెచారా’ చిత్రం తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైంది. దివంగత యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ నటించిన ఆఖరి చిత్రం ఇదే.