*64 కళలూ పండిన*
*మాయాబజార్ కు*
*64 ఏళ్లు నిండాయి!
* భళిభళిభళిరా దేవా బాగున్నదయా నీ మాయ.. బహుబాగున్నదయా నీ మాయ! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్.. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం హాస్యానికి పట్టం.. సావిత్రి అనే మొండిఘటం.. కెవిరెడ్డి చేతివాటం.. ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా.. అపురూప దృశ్య కావ్యమా..? అద్భుతమట స్క్రీన్ ప్లే..
ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ పవర్ ప్లే.. అంతటి మహానటుడి అభినయానికి సావిత్రి రీప్లే.. కృష్ణుడిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం.. అభిమన్యుడు అక్కినేని సమ్మోహన రూపం.. సుపుత్రా నీకిది తగదురా అంటూ హిడింబిగా సూర్యకాంతం సరికొత్త రూపం..
ఓ చిన్నమయ..లంబు జంబు.. రేలంగి హాస్య విన్యాసం.. పక్కన శాస్త్రి,శర్మ కోరసం.. అంజిగాడి బాబాయిల పద్యం చెప్పుల నాట్యాలు.. తివాచీ అల్లర్లు.. ఘటోత్కచుడి పదఘట్టనకు విరిగి పడిన కొండ ముక్క.. పేరు చెప్పి శరణు కోరమనే వైనం.. సుభద్ర రౌద్రం.. వెంటనే మాత రక్షణలో దూరిన అంతటి ఆజానుబాహువు..
ఎన్నని చెప్పాలి.. ఎన్నిసార్లని చూడాలి.. వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు… ఈ పాట కళ్ళకు,వీనులకు విందే…ఇప్పటికీ పసందే.. హై హై నాయకా.. వై గురూ..వీరతాళ్లు.. ఆస్మదీయులు,తసమదీయులు అబ్బురపరిచే పదప్రయోగాలు దుషట చతుషటయటహ.. నల్లరమ్మూర్తి పలికన విధం దానిని రంగారావు మారుపలికిన విధానం.. దేనికదే అద్భుతః.. ప్రియదర్శిని,లాహిరిలాహిరి సత్యపీఠం..గిల్పం..గింబళి.. ఇవన్నీ అలరించే పదాలు..
ఆ ప్రియదర్శినిలో అక్కినేనిని చూడగానే వెనక్కి జరిగిన సావిత్రి పాదాలు.. గమ్మత్తుగా విడివడిన ఆ అభినేత్రి పెదాలు.. కెవిరెడ్డి దర్శకత్వ ప్రతిభకు పరమపధాలు.. ముక్కోపానికి విరుగుడు ఉండనే ఉందిగా ముఖస్తుతి..
రసపట్టులో తర్కం కూడదు.. లక్ష శనిగ్రహాల పెట్టు మా శకుని బాబాయ్ ఈ గదిలో ఉండగా అసలు శని గ్రహం ఏ గదిలో ఉంటేనేమి.. శశిరేఖాభిమన్యుల కళ్యాణ ముహూర్తానికి శ్రీకృష్ణుడి ముక్తాయింపు…
నేనే కాస్త సుకుమారంగా ఉండాల్సిందంటూ సావిత్రి విరుపు.. అంతలోనే శశిరేఖననే సంగతి మైమరపు.. నమోకృష్ణ నమోకృష్ణ అంటూ సర్డుకున్న సౌకుమార్యం.. అంతకుముందే తాళిగట్ట వచ్చునంట..అంటూ రెచ్చిపోయిన క్రౌర్యం… చివర్లో పాణిగ్రహణం.. కరగ్రహణం.. చస్తుంటే సంధిమంత్రంలా దుశ్శాసనుడు మనవాడు కృష్ణుడికి భలే చెప్పాడంటూ పొంగిపోయిన తీరు.. అబ్బాయికేమైనా చిత్తచాంచల్యం ఉందా.. గుమ్మడి గారి శంక..
దిష్టి ఓ వంక.. ఈ సన్నివేశాలన్నీ పకపక.. స్వోత్కర్షతో శకుని పద్యం నిష్కర్షగా చివరలో దుర్యోధన,దుశ్శాసన..కర్ణ శకుని హతకులకు ఘటో హెచ్చరిక.. మాయాశశిని వెన్నంటి తిరిగిన పరిచారిక.. గుమ్మడి,ఛాయాదేవి, సీఎస్సార్,ఆర్ నాగేశ్వర రావు.. మిక్కిలినేని..సంధ్య..బొడ్డపాటి నాగభూషణం… మధ్యలో కనిపించి ముసిలి కృష్ణుడు ప్రయాగ.. ఏనుగులు మింగేవా.. పర్వతాలు ఫలహారం చేసేవా అని ఎస్వీఆర్ ఆశ్చర్యపడగా ఎన్టీఆర్ ప్రత్యక్షమైన సన్నివేశం దుష్టచతుష్టయాన్ని మూటకట్టేసి ఎగరేసిన పతాక సన్నివేశం.. ఇలాంటివెన్నో చేశాయి మాయాబజార్ ను ఉపఖండంలోనే అతి గొప్ప కళాఖండం..
ప్రపంచ సినిమా చరిత్రలో ఓ బ్రహ్మాండం… మొదట్లో,చివర్లో ఉర్రూతలూగించే విజయా వారి జెండా,మ్యూజిక్ ఎప్పటికీ స్మృతి పథంలో నిలిచిపోయే అండపిండ బ్రహ్మాండం.. సంవత్సరాల పాటు రిపీట్ రన్స్ లో కూడా నిండిపోయిన సినిమా హాళ్లు.. మరి చక్రపాణికి,కెవిరెడ్డికి ఎన్ని వెయ్యాలో కదా వీరతాళ్లు..!
మాయాబజార్ విడుదలై (27.3.57)64 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. —దామరాజు
Source whatsapp