బ్యానర్: టైటిల్ కార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: సత్యదేవ్, పూజ ఝవేరి, రవివర్మ, రోషిణి ప్రకాష్, శ్రీకాంత్ ఐయంగార్, హరితేజ, కిరీటి తదితరులు
సంగీతం: రఘు కుంచె
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
ఛాయాగ్రహణం: జి.కె.
నిర్మాతలు: శశి దబ్బర, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ
రచన, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
విడుదల తేదీ: జూన్ 30, 2020
వేదిక: జీ5
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం వేగం పుంజుకున్న నేపథ్యంలో కొత్తగా రిలీజ్ అయిన తెలుగు చలనచిత్రం ‘47 డేస్’. జీ5 వేదికగా విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో ఓటీటీ ఆడియన్స్‌ని ఆకర్షించే అంశాలయితే వున్నాయి కానీ నూట అయిదు నిమిషాల పాటు ఆసక్తి కోల్పోకుండా కూర్చోబెట్టే లక్షణాలు మాత్రం లేవు.
కథలోకి వెళితే… భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత సస్పెన్షన్‌కి గురయిన ఓ పోలీస్ అధికారికి తన భార్య చనిపోయిన రోజే మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు, అతను కూడా ఆమె వెళ్లిన పార్టీకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఆ పార్టీలో ఏం జరిగింది? చనిపోయిన మరో వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? అనే అన్వేషణ మొదలవుతుంది. కూపీ లాగే కొద్దీ మరింత ప్రశ్నార్ధకంగా మారిన ఆ జంట ఆత్మహత్యలకి అసలు కారణమేంటి? దాని వెనుక ఉన్నదెవరు?
మొదలవడం ఆసక్తికరంగానే మొదలయినా కానీ ముందుకు సాగే కొద్దీ కథనం పలుచబడిపోయి, తక్కువ నిడివి కూడా భారంగా పరిణమిస్తుంది. ఇలాంటి కథలను బిగి సడలకుండా, గోళ్లు కొరుక్కునేంత టెన్షన్‌తో నడిపించాలి. కానీ ‘47 డేస్’ ఏ దశలోను అంత టెన్షన్ కలిగించదు. పాత్రలకి తగిన నేపథ్యం లేకుండా మొదలయిపోవడంతో వారికి ఏమి జరిగిందని తెలుసుకోవాలనే ఆరాటం ఏర్పడదు. కనీసం జరుగుతోన్న సంఘటనలయినా ఆసక్తికరంగా, పాత్రల ప్రవర్తన అయినా సీరియస్‌గా తీసుకునే విధంగా వుంటుందా అంటే అదీ జరగదు.
అసలేమి జరిగిందనేది చివర్లోనే రివీల్ చేసినా కానీ అంతవరకు కదలకుండా కూర్చోపెట్టే బలం కథనంలో లేదు. పలు పాత్రలను తీర్చిదిద్దిన తీరు, ఆ పాత్రధారుల ప్రవర్తన, నటన కూడా డిస్‌కనక్ట్ అవడానికి కారణమవుతుంది. చూస్తోన్న వీక్షకుడికి వచ్చే అనుమానాలు, అడగాలనిపించే ప్రశ్నలు కథానాయకుడికి బోధపడవు. పైగా అతనో పెద్ద పోలీస్ అధికారి కూడా. ఎంగేజ్ చేయగలిగేలా కథనం ఉన్నట్టయితే ‘47 డేస్’ ఈ ప్లాట్‌ఫామ్‌కి అనువైన ప్లాట్ వున్న సినిమానే. కానీ పేలవమైన కథనం, బలహీనమైన సన్నివేశాల వల్ల సీక్రెట్ రివీల్ అయ్యేవరకు కూడా చూడాలనే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. కొన్ని పాత్రలు (పూజ ఝవేరి) ఉత్సుకత పెంచే విధంగా పరిచయమై తర్వాత అర్థంలేని ప్రవర్తన, విచిత్రమైన నడవడికతో సినిమా పట్ల చిన్నచూపు వచ్చేట్టు చేస్తాయి.
ఏ పాత్ర తాలూకు నేపథ్యం నమ్మశక్యంగా అనిపించదు. ఏ సంఘటన యొక్క ప్రభావం ఆసక్తిని పెంచదు. ఏ సన్నివేశం వెనుక ‘థాట్’ పెట్టిన దాఖలాలు వుండవు. సీరియస్ ఇన్వెస్టిగేషన్‌పై హీరో ఒక జుంబా క్లాస్‌కి వెళితే వెనుక అవసరం లేని వెకిలి కామెడీ దేనికనేది అర్థం కాదు. హీరో పోలీస్ అయి వుండీ తను చాలా కాలంగా వెతుకుతున్న వ్యక్తి తారసపడితే కరక్ట్ క్వశ్చన్స్ అడగడు. సీక్రెట్ క్లయిమాక్స్‌లోనే రివీల్ అవ్వాలి కనుక అతనికి అవి అడగాలనిపించలేదని అనుకోవాలి. అలాగే ఏళ్ల తరబడి వెతుకుతోన్న వ్యక్తి ఎవరో తెలిసిన తర్వాత అతనికి తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి వెంటనే కలవాలని చూస్తారా లేక కోడ్ లాంగ్వేజ్‌లో ఉత్తరం రాసి త్వరలో కలుద్దామంటారా?
ఇలాంటి లాజిక్ లేని, అర్థరహిత సన్నివేశాలతో సాగిపోయే ఈ కథలో చివరకు అసలు సంగతి తెలిసినా కాసింత కూడా సర్‌ప్రైజ్ వుండదు. అసలు విలన్ తాలూకు మోటివ్, అతను చెప్పే రీజన్ చాలా కామెడీగా అనిపిస్తాయి. పైగా ఆ పాత్రలోని విలనీ అంతా ఒకేసారి చూపించాలన్నట్టు అవసరానికి మించి యాక్షన్ చేయించడంతో సదరు సన్నివేశం మరింత సిల్లీగా తయారయింది. 47 రోజుల్లో శోధనకు కారణం ఏమిటో? రాండమ్‌గా ఆ రోజులని స్క్రీన్‌పై చూపించడం వల్ల ఒరిగిన ప్రయోజనం ఏమిటో దర్శకుడికే తెలియాలి.
సత్యదేవ్ మంచి నటుడే కానీ విషయం లేని సన్నివేశాలు, అర్థం లేని ఘట్టాల మధ్య ఎంత టాలెంట్ వున్నా పెద్ద ప్రయోజనం వుండదు. పూజ ఝవేరి క్యారెక్టరైజేషన్ సిల్లీగా అనిపిస్తుంది. రవికాంత్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులెవరూ మెప్పించలేదు. సాంకేతిక విభాగంలో నేపథ్య సంగీతం వరకు ఫరవాలేదనిపిస్తుంది. దర్శకుడు ప్రదీప్ ఆసక్తికరమయిన కథాంశాన్ని ఎంచుకున్నా కానీ రక్తి కట్టించే కథనం రాసుకోలేదు. ఆ ఎఫెక్ట్ మిగిలిన చాలా అంశాలపై రిఫ్లెక్ట్ అవడంతో దర్శకుడిగా అతని పనితనం నిరాశపరుస్తుంది.
సినిమా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులని అయినా కూర్చోపెట్టవచ్చు కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీక్షకుడి అటెన్షన్ ఎక్కువ సేపు రాబట్టుకోవడం చాలా కష్టం. చేతిలో రిమోట్ వుండి, అందుబాటులో ఎన్నో ఆప్షన్స్ వున్నపుడు చివరి వరకు చూసేలా చేయడానికి మరింత పకడ్బందీ కంటెంట్ అందించాలి. ఇలాంటి నాసిరకం థ్రిల్లర్స్ రూపొందిస్తే మాత్రం చాలా కష్టం మరి!