*ఎయిర్‌టెల్ ఆఫర్: 11GB* *వరకు ఉచిత డేటా*
ఇంటర్నెట్ డెస్క్:_ జియో వచ్చాక టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడం పరిపాటి. అదే బాటలో ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ బొనాంజా ప్రకటించింది. నూతనంగా 4G సిమ్‌ను తీసుకోవడం గానీ, 4Gకి డివైస్‌కు అప్‌గ్రేడ్ అయిన వినియోగదారులకు 11GB వరకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.
*కొత్త వినియోగదారుడైతే..* ఎయిర్‌టెల్ అందించే 11GB డేటాను రెండు విడతల్లో పొందే అవకాశం ఉంది. అందులో మొదటిది.. కొత్తగా ఎయిర్‌టెల్ 4G కస్టమర్ ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే 5GB డేటా వస్తుంది. అయితే ఈ డేటా మొత్తం ఐదు 1GB కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్‌లో క్రెడిట్ అవుతుంది. కొత్త మొబైల్ నంబర్ యాక్టివేట్ అయిన నెల రోజుల్లో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఐదు కూపన్లు వస్తే.. యాప్‌లోని ‘మై కూపన్స్’ సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. అయితే 1GB డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రీడిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోతే 5GB డేటాకు బదులు 2GB డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
*అన్‌లిమిటెడ్ ప్యాకేజీతో..* ఇక ఎయిర్‌టెల్ కూడా తన అన్‌లిమిటెడ్ ప్యాకేజీ తీసుకునే వినియోగదారులకు దాదాపు 6GBడేటా వరకు ఉచితంగా అందివ్వనుంది. 84 రోజుల వాలిడిటీతో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీలను ఎంచుకునే కస్టమర్లకు 6GB డేటా ఉచితంగా వస్తుందని ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ డేటా అంతా ఒక్కసారిగా రాదు. వినియోగదారులు ఆరు 1 GBఉచిత డేటా కూపన్ల రూపంలో వస్తుంది. అలానే రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్ తీసుకుంటే నాలుగు కూపన్లు, రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే రెండు కూపన్లు వస్తాయి. ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ యాప్ ద్వారా రీఛార్జి చేయాల్సి ఉంటుంది. కొత్త 4G ఎయిర్‌టెల్ కస్టమర్ అయి ఉండి రూ.598 ప్రీపెయిడ్ ప్యాక్‌ను తీసుకుంటే మొత్తం 11GB డేటా పొందే అవకాశం ఉంది.