*స్మార్ట్‌ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్*
*గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు మంచి స్పందన*
*అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడి*
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో (జీఐఎఫ్) స్మార్ట్‌ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్ నెలకొందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడించారు. వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్‌కు మరింత స్పందన లభిస్తోందని, ప్రారంభమైన తొలి 48 గంటల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించి 5,000 పైచిలుకు విక్రేతలు పాల్గొన్నారని తివారీ చెప్పారు. గతేడాది ఫెస్టివల్ సేల్ మొత్తం మీద అమ్ముడైన ఐఫోన్లకు మించి ఈసారి ఒక్కరోజులోనే అమ్ముడవడం గమనార్హమని తివారీ తెలిపారు.
నవంబర్ 13 దాకా జరిగే ‘ఫినాలే డేస్’ సందర్భంగా భారీ ఉపకరణాలు, టీవీలపై 75 శాతం దాకా, గృహోపకరణాలపై 80 శాతం దాకా, స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే, కనీస ఆర్డర్ పరిమితికి లోబడి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంటు ఉంటుందని తెలిపారు. *పెరిగిన విక్రేతలు..
* కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతంతో పోలిస్తే కొత్త విక్రేతల రిజిస్ట్రేషన్ల సంఖ్య 50 శాతం పెరిగిందని తివారీ వివరించారు. వ్యక్తిగత గ్రూమింగ్ ఉత్పత్తులు, స్టడీ ఫ్రం హోమ్‌కి అవసరమైన ఉత్పత్తులు, గృహోపకరణాలు మొదలైన వాటికి ఆర్డర్లు గణనీయంగా వస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో డిమాండ్‌కి అనుగుణంగా వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను డెలివర్ చేయడానికి అమెజాన్ భారీ సన్నాహాలు చేసిందని తివారీ చెప్పారు.
కొత్తగా దాదాపు 200 డెలివరీ స్టేషన్లు, వేలకొద్దీ డెలివరీ పార్ట్‌నర్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 8 స్టోర్ సెంటర్లను విస్తరించడంతో పాటు మరో అయిదింటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ నేపథ్యంలో సుమారు 1,00,000 పైచిలుకు సీజనల్ ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు.