*మాస్క్ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు*
*లేకుంటే రేషనూ ఉండదు* *విద్యా సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లోకీ అనుమతించరు*
*ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ఉత్తర్వులు*
అమరావతి: ఏడాదికిపైగా కరోనా వైరస్ వెంటాడే పరిస్థితులు ఉన్నందున ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్కు ధరించని వారికి విద్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, దుకాణ సముదాయాలు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలలోకి అనుమతి నిరాకరించాలని సూచించింది.
ఒకవేళ మాస్కులు లేకుండా ఎవరైనా వస్తే సంబంధిత ప్రదేశాల్లోనే వాటిని కొనుక్కునేలా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఔషధాలు, చౌక దుకాణాలు, ఎరువుల దుకాణాలకు వచ్చినవారు మాస్కులు ధరించకుంటే సేవలను నిరాకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
మాస్కులు ధరించడంతోపాటు ఎడం పాటించడం, చేతుల శుభ్రత తప్పనిసరని పేర్కొన్నారు. ఈ 3 ప్రమాణాలను పాటించడంపై 3 నిమిషాల్లో సామాన్యులకు అర్థమయ్యేలా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘మాస్కే కవచం’ కింద చేపట్టిన ప్రచార కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
ప్రజలు స్వీయరక్షణ చర్యలు పాటిస్తున్నది లేనిది పోలీసులు గుర్తించి ప్రభుత్వానికి వారాంతపు నివేదికలివ్వాలని ఆదేశించారు.
* తరగతి గదిలో విద్యార్థులు తరచూ చేతులు శుభ్రం చేసుకోవడానికి సౌకర్యాలను కల్పించాలి. *
వాణిజ్య, పారిశ్రామిక ప్రదేశాల్లో 2 గంటలకోసారి మైకుల ద్వారా 3 స్వీయ రక్షణ ప్రమాణాల ప్రాధాన్యంపై వివరించాలి. * ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో జనం గుమికూడే చోట ప్రమాణాలు పాటించేలా చూడాలి.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, బస్సులు, ఆటోల్లోనూ కొవిడ్-19 నివారణ చర్యలపై వాల్‌పోస్టర్లను అంటించాలి.
* ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలు, నోటీసుల్లో 3 ప్రమాణాల అమలును ప్రస్తావించాలి.
* వైరస్ నివారణపై అవగాహన కల్పించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో కరపత్రాలు అంటించాలి. బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలను పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఏర్పాటుచేయాలి.
* అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల గోడలపై కరపత్రాలను అంటించాలి. యూట్యాబ్, ఫేస్‌బుక్, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహనకు చర్యలు తీసుకోవాలి. కొవిడ్-19పై ఉన్న భయాందోళనలు పోగొట్టేలా ఈ కార్యక్రమాలు రూపొందించాలి. * రాష్ట్రంలో 1.3 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. 77 లక్షల మంది ఆరోగ్యసేతు యాప్‌ను అనుసరిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.
* గ్రామ, వార్డు సచివాలయాల్లో యోగా, ధ్యానం తరగతుల నిర్వహణకు ‘ఆయుష్’ ద్వారా చర్యలు తీసుకోవాలి.
* వాలంటీర్లు నెలలో 5సార్లు ఇంటింటికి వెళ్లి జబ్బుపడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ఆరోగ్య పరిస్థితులను గమనించాలి.
* రైతుబజార్లు, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు, షాపింగ్‌మాల్స్, ఇతర చోట్ల 3 ప్రమాణాల ఆచరణకు ఒక్కో చోట ఒక్కో అధికారికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలి.