*AP: ఇంటివద్దకే కళ్లద్దాలు*
*‘వైఎస్సార్ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు*
*1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్ వల్ల అప్పట్లో వాయిదా*
*నెలాఖరులోగా ఉపాధ్యాయుల ద్వారా పంపిణీ* *వృద్ధులకు మరో 95 వేల కళ్లద్దాలు ఇవ్వడానికి ఏర్పాట్లు*
అమరావతి: ‘వైఎస్సార్ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు సిద్ధం చేశారు. మార్చినెలలోనే ఈ కళ్లద్దాలు పంపిణీ చేయాల్సి ఉన్నా కోవిడ్–19 కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలో స్కూళ్లు తెరిచే అవకాశం ఉండటంతో ఆలోగా చిన్నారులకు ఉపాధ్యాయుల ద్వారా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది చిన్నారులకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇవ్వడం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
► రాష్ట్రంలో మొదటి, రెండో దశ కంటి వెలుగులో భాగంగా 60,393 స్కూళ్లలో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
► వీరిలో 4.38 లక్షల మంది చిన్నారులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు గుర్తించారు.
► మరో 55 వేల మందికి విజన్ కిట్‌లు పంపిణీ చేస్తున్నారు.
► మూడో దశ కంటి వెలుగులో భాగంగా 60 ఏళ్లు దాటిన 3,06,961 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించగా 95,075 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు.
► వీరికి వచ్చే నెల మొదటి వారంలో కళ్లద్దాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కళ్లద్దాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పారు.
► మూడో దశలో మరింత మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమం కోవిడ్ కారణంగా వాయిదా పడింది.
► కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చాక కోవిడ్ పరిస్థితులు రావడం, కళ్లద్దాలు తయారుచేసే సంస్థలు కొంతకాలం మూతపడటం వల్ల వాటి పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది.
► కాగా, మొదటి దశలో రూ.11.18 కోట్లు, రెండో దశలో రూ.12.65 కోట్లు, మూడో దశలో రూ. 6.60 కోట్లు వ్యయం అయ్యింది.