*ఫిర్యాదు యాప్‌లోనే..*
*ఎఫ్‌ఐఆర్ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు..*
*‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌తో 87 రకాల సేవలు*
*ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, పౌరులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ‘ఏపీ పోలీసు సేవ’ యాప్ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులంటే ఒక బలం, శక్తిగా కాకుండా సేవలందించే వారిగా ప్రజల్లో భావన కలిగించగలిగినప్పుడే స్నేహపూర్వక పోలీసింగ్ సాధ్యపడుతుందని చెప్పారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఈ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ‘పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా, ఎఫ్‌ఐఆర్ ప్రతి పొందాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు. అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుంది.
పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాలా సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. మొత్తం ఆరు విభాగాల్లో 87 రకాల పౌర సేవలు ప్రజలకు అందుతాయి. పోలీసుల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని, వారిని ఆశ్రయించవచ్చనే ఆత్మవిశ్వాసం కల్పించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది’ అని సీఎం చెప్పారు. * ధ్రువపత్రాలు పొందాలన్నా, పోయిన వాటిపై ఫిర్యాదు చేయాలన్నా, లైసెన్సులు నవీకరించుకోవాలన్నా, నిరభ్యంతర పత్రం కావాలన్నా పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవొచ్చు.
* ఎఫ్‌ఐఆర్ ప్రతిని పొందొచ్చు. దాని స్థితిగతులను తెలుసుకోవొచ్చు. * మహిళల భద్రత, రక్షణకు సంబంధించిన 12 అంశాలతోపాటు, దిశ యాప్ అనుసంధానమై ఉంటుంది.
* రహదారి భద్రతకు సంబంధించి 6 అంశాలున్నాయి. ఎక్కడ ప్రమాదం జరిగినా యాప్ ద్వారా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారమివ్వొచ్చు.
* సైబర్ నేరాలపై ఫిర్యాదులు, అవగాహనకు సంబంధించి 15 అంశాలున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారంలో వాస్తవికతను నిర్ధారించుకునేందుకు ‘ఫ్యాక్ట్ చెక్’ అందుబాటులో ఉంది.
* దిశ యాప్‌ను ఇప్పటివరకూ 11 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా 568 ఫిర్యాదులు అందగా.. వాటిల్లో 117పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
*పెండింగ్ కేసుల పరిష్కారానికి వారోత్సవం*
హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వారోత్సవం నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సేవలు అందిస్తున్నందుకు ఈ ఏడాది ఇప్పటికే పోలీసుశాఖకు ఎన్నో అవార్డులు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. రాష్ట్రంలోని వెయ్యికి పైగా పోలీసు స్టేషన్లలోని 46వేల సిబ్బంది వీడియో సమావేశంద్వారా పాల్గొన్నారు.