అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్న విద్యాకానుక’ పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే ‘మోదీ-జగనన్న విద్యా కానుక’ అనడం సమంజసమన్నారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే..
రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మాత్రమే భరిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులకు తదితరాలకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులు వెచ్చిస్తోందంటూ ట్వీట్ చేశారు.
కేంద్రం, రాష్ట్రం దేనికెంతెంత ఖర్చు చేస్తోందో సంబంధిత వివరాలను పొందుపరిచారు. మరోవైపు ఈ పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతోందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇది వరకే మీడియాకు వెల్లడించారు.
పథకం విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వివరాలతో సహా ట్వీట్ చేయడం గమనార్హం.