డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, సారాకు సమన్లు

Spread the love

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. రియా చక్రబొర్తితో పాటు, క్వాన్ కంపెనీకి చెందిన జయ సాహాను ప్రశ్నించిన తర్వాత.. కొంతమంది హీరోయిన్లకు నోటీసులు జారీ చేయాలని ఎన్సీబీ నిర్ణయించింది.

ఈ క్రమంలో అంతా ఊహించినట్టుగానే హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాకపూర్ కు నోటీసులు జారీ చేసింది. వీళ్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్, సుశాంత్ మేనేజర్ శృతి మోడీకి కూడా సమన్లు జారీ చేసింది.

వీళ్లలో హీరోయిన్ రకుల్ ను రేపే ముంబయి రావాల్సిందిగా ఎన్సీబీ ఆదేశించింది. రకుల్ తో పాటు శృతి మోడీ, సిమోన్ ను కూడా రేపే ప్రశ్నించబోతున్నారు. ఇక దీపిక పదుకోన్ ను సెప్టెంబర్ 25న, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ ను సెప్టెంబర్ 26న ప్రశ్నించబోతున్నారు.

3 రోజులుగా కరిష్మా, జయసహాను విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు.. వాళ్ల ఛాటింగ్స్ లో కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. పక్కా ఆధారాలు దొరకడం వల్లనే దీపిక లాంటి హీరోయిన్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వగలిగారు అధికారులు.

కరిష్మా, దీపిక మధ్య వాట్సాప్ సంభాషణగా చెప్పే స్క్రీన్ షాట్స్ కొన్ని ఇది వరకే మీడియాలోకి వచ్చేశాయి. వాటిలో డ్రగ్స్ పర్యాయపదాలు కనిపించాయి. సీబీడీ ఆయిల్, ఎండీ లాంటి పదాలు దొర్లాయి. వీటితో పాటు D, N, S లాంటి కోడ్ పదాలు కూడా కనిపించాయి. వీటన్నింటిపై ఎన్సీబీ అధికారులు, ఈ హీరోయిన్లను ప్రశ్నించబోతున్నారు.

మొన్నటివరకు ముంబయిలో ఉన్న రకుల్, నిన్ననే హైదరాబాద్ వచ్చింది. ఈరోజు క్రిష్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు ఎన్సీబీ నోటీసులు ఇవ్వడంతో, రేపు విచారణలో పాల్గొనేందుకు ఆమె మళ్లీ ముంబయి వెళ్లబోతోంది. దీంతో క్రిష్ షూటింగ్ కు అంతరాయం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *