గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం

Spread the love

*గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం* *చివరి విద్యార్థికీ  నాణ్యమైన విద్య అందాలి* *సీఐఐ ‘ఆన్‌లైన్‌ ఎడ్యు సమ్మిట్‌’లో నిపుణుల సూచన* ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని పది శాతం ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు నాణ్యమైన విద్యనందించడంలో ముందున్నాయని, మిగిలిన 90 శాతం విద్యా సంస్థల్లోనూ నాణ్యమైన విద్య అందితేనే యువతకు మంచి భవిష్యత్తును అందించగలమని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతంలోని చివరి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడం దేశం ముందున్న సవాలు అని, వారిలో డిజిటల్‌ అంతరం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఆన్‌లైన్‌ ఎడ్యు సమ్మిట్‌లో ‘ఉన్నత విద్యలో డిజిటలీకరణ- అంతర్జాతీయీకరణ- సహకారం’ అనే అంశంపై నిపుణులు చర్చించారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ.. ఐఐటీలు, ఐఐఎంలు, హైదరాబాద్‌లోని ఐఎస్‌టీ లాంటి సంస్థలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రపంచస్థాయి విద్యనందించడం వంటి అంశాల్లో విజయం సాధిస్తున్నాయన్నారు. వీటిలో చదివేది 10 శాతం మంది విద్యార్థులేనని, 90 శాతం మంది చదివే మిగిలిన సంస్థల్లోనూ ఆ దిశగా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. హరప్ప ఎడ్యుకేషన్‌ సంస్థ ఎండీ ప్రమాత్‌ సిన్హా మాట్లాడుతూ గొప్ప గురువులు లేకుండా…తరగతి గదుల్లో అద్భుతాలు చేయలేమని, ఉత్తమ విద్యార్థులను తయారు చేయలేమని కుండ బద్దలుకొట్టారు. 19, 20 శతాబ్దపు నమూనాలతో 21వ శతాబ్దంలోని సమస్యలను పరిష్కరించలేమన్నారు. అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌ సంచాలకుడు ఆర్‌.రామనన్‌, ఐఎంటీ హైదరాబాద్‌ సంచాలకుడు ఎం.వెంకటేశ్వర్లు, డెలాయిట్‌ టాలెంట్‌ లీడర్‌ వికాస్‌ గుప్తా మాట్లాడారు. సదస్సులో ఐఐటీహెచ్‌ సంచాలకుడు బీఎస్‌ మూర్తి, ఐఐఎం బెంగళూరు సంచాలకుడు రిషికేష్‌ కృష్ణన్‌, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *