*జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌

Spread the love

*జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌*

దిల్లీ: దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2017 డిసెంబర్ ‌1 కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి. 2021 జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్‌ విధానాన్ని 2017 నుంచి కేంద్రం అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ తప్పనిసరైంది. అలాగే ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేయించాలంటే ఫాస్టాగ్‌ తప్పనిసరి అని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే థర్డ్‌ పార్టీ బీమా తీసుకోవాలన్నా ఫాస్టాగ్‌ తీసుకోవాలన్న నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం టోల్‌ ప్లాజాల వద్ద ఇక నూరు శాతం ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *